Share News

Akhanda Godavari: భారత్‌లో వేగంగా పర్యాటకం

ABN , Publish Date - Jun 27 , 2025 | 06:06 AM

భారత్‌లో పర్యాటకుల శాతం వేగంగా పెరుగుతోందని, అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు దేశంలోనే ప్రఖ్యాత టూరిజం స్పాట్‌ అవుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు.

Akhanda Godavari: భారత్‌లో వేగంగా పర్యాటకం

  • ప్రఖ్యాత టూరిజం స్పాట్‌గా ‘అఖండ గోదావరి’

  • బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌, ఏకో టూరిజం ఇస్తాం: షెకావత్‌

రాజమహేంద్రవరం, అమరావతి, జూన్‌26 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో పర్యాటకుల శాతం వేగంగా పెరుగుతోందని, అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు దేశంలోనే ప్రఖ్యాత టూరిజం స్పాట్‌ అవుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. గురువారం ఆయన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, ఎంపీ పురందేశ్వరి తదితరులతో కలిసి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం బొమ్మూరులోని సైన్స్‌ మ్యూజియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో షెకావత్‌ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రధాని మోదీ సహకారంతో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ‘భారత్‌ను పర్యాటకుల గమన్యస్థానంగా తీర్చిదిద్దనున్నాం. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు, వనరులు మెండుగా ఉన్నాయి.


వాటిని వినియోగించుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏపీలో బుద్దిస్ట్‌ సర్క్యూట్‌, కోస్టల్‌లో ఎకో టూరిజం ఏర్పాటు చేస్తున్నాం. పుట్టపర్తి, అరకు లోయలో లైట్స్‌ అండ్‌ సౌండ్‌ షో ఏర్పాటు చేయనున్నాం. విశాఖ పోర్ట్‌లో క్రూయిజ్‌ అండ్‌ కార్గో టెర్మినల్‌, తిరుపతి రైల్వేస్టేషన్‌ ఆధునికీకరించనున్నాం. స్వదేశీ దర్శన్‌ 2.0 ద్వారా అరకు, బొర్రా గుహలు, లంబసింగి ప్రాంతాలతోపాటు, సూర్యలంక బీచ్‌నూ అభివృద్ధి చేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, ఎంపీ పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్‌ చొరవతో ఏపీలో రూ.450 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతోంది’ అని వివరించారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి 2035 నాటికి 35 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.


మోదీ విజన్‌.. బాబు ప్లానింగ్‌తో ఏపీ అభివృద్ధి

ప్రధాని మోదీ విజన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లానింగ్‌తో ఏపీ డబుల్‌ వేగంతో అభివృద్ధి చెందుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అన్నారు. విజయవాడలోని ఒక హోటల్లో ఏపీ బేజీపీ ఏర్పాటు చేసిన ‘ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు’ ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ఏపీలో ఇరిగేషన్‌, టూరిజమ్‌ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. యాభై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 06:06 AM