Share News

AJ Sekhar Reddy : స్వామికి సేవ చేయడమే తెలుసు!

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:26 AM

స్వామి సేవలో ఎలాంటి లోటుపాట్లు కలిగినా సహించలేను. అలాంటిది స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపేందుకు నేను సహకరిస్తానా? ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి’’

AJ Sekhar Reddy : స్వామికి సేవ చేయడమే తెలుసు!

  • శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు,సేవకు రూ.కోట్లు వెచ్చించాను

  • దేవుడిని అడ్డుపెట్టుకుని సంపాదించడం తెలియదు

  • నాపై ఆరోపణలు సరి కాదు

  • లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే!

  • టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డి

చెన్నై, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘‘స్వామివారి సేవకు సొంతంగా ఖర్చు చేయడమే నాకు తెలుసు. దేవుడిని అడ్డుపెట్టుకుని సంపాదించడం తెలియదు. స్వామివారి ఆలయాలకు, అక్కడ జరిగే సేవలకు ఎన్నో కోట్లు వెచ్చించాను. స్వామి సేవలో ఎలాంటి లోటుపాట్లు కలిగినా సహించలేను. అలాంటిది స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపేందుకు నేను సహకరిస్తానా? ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి’’ అని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఏజే శేఖర్‌ రెడ్డి హితవు పలికారు. తిరుమల లడ్డూ తయారీ కోసం నాణ్యతలేని నెయ్యి సరఫరా వ్యవహారానికి సంబంధించి మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తనపై వస్తున్న పరోక్ష ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవారు నిజానిజాలు తెలుసుకుంటే మంచిదని సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘అలిపిరి వద్ద రూ.15 కోట్ల వ్యయంతో గోమందిరం నిర్మించి, దేవస్థానానికి అప్పజెప్పాను. చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయం, కన్నియాకుమారి, వేలూరు, ఉళుందూరుపేటల్లో శ్రీవారి ఆలయ నిర్మాణాల కోసం నేను వ్యక్తిగతంగా భారీ విరాళాలు ఇవ్వడంతోపాటు, వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాను. చెన్నై టి.నగర్‌లోనూ స్వామివారి కోసం రూ.150 కోట్లతో ఆలయ విస్తరణ ప్రణాళిక సిద్ధంగా ఉంది. గత 13 ఏళ్లుగా ప్రతిరోజూ స్వామివారి కైంకర్యం కోసం బెంగళూరు నుంచి 20 కిలోల సంపంగి పుష్పాలు ఏర్పాటు చేస్తున్నాను.


పవిత్ర హృదయంతో స్వామివారిని సేవించుకోవడమే తప్ప, ఆయన సేవలను అపవిత్రం చేయడం నాకు తెలియదు. టీటీడీ బోర్డు సభ్యుడిగా, చెన్నై ఎల్‌ఏసీ అధ్యక్షుడిగా స్వామివారు కల్పించిన అవకాశాన్ని భక్తుల సేవలకు వినియోగించానే తప్ప, ఎక్కడా దుర్వినియోగానికి పాల్పడలేదు. అలాంటి నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరి కాదు. అది ఎంతో పాపం కూడా! ఎక్కడో ఎవరో తప్పు చేస్తే.. ఇప్పుడు పరోక్షంగా నా పేరు స్ఫురణకు వచ్చేలా కథనాలు ప్రచురించడం సబబు కాదు. తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాను. స్వామి సేవను అపవిత్రం చేసిన వారిని వదలరాదని ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని శేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు.

సవరణ

‘ఇద్దరు టీటీడీ ముఖ్యులకు లుకౌట్‌ నోటీసులు!?’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ఒక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఇందులో... గత పాలక మండలి సభ్యుడొకరు అప్పటి టీటీడీ ముఖ్య అధికారితో సన్నిహితంగా మెలిగి... నెయ్యి ఒప్పందాలు కుదర్చడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ప్రచురితమైంది. ఇద్దరికీ లుకౌట్‌ నోటీసులు జారీ కానున్నట్లు సమాచారం అందినట్లు కూడా ప్రచురితమైంది. అయితే, ఇది నిజం కాదు. సమాచార లోపం కారణంగా ఈ పొరపాటు జరిగింది.

- ఎడిటర్‌

Updated Date - Feb 18 , 2025 | 04:26 AM