DGP Harish Kumar Gupta: ఆర్నెల్లలో పోలీసు శాఖలో ఏఐ యాప్‌లు
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:44 AM
పోలీసు శాఖ దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు లభించాయని, వీటిని ఆరు నెలల్లో ఏఐ ఆధారిత అప్లికేషన్ల ద్వారా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.

నేరాలకు పాల్పడితే ఆటోమేటిక్‌గా గుర్తించే వ్యవస్థలు
‘ఏఐ ఫర్ ఏపీ పోలీసు’ హ్యాకథాన్‌తో మంచి ఫలితాలు
ముగింపు కార్యక్రమంలో డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా
గుంటూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు లభించాయని, వీటిని ఆరు నెలల్లో ఏఐ ఆధారిత అప్లికేషన్ల ద్వారా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా పేర్కొన్నారు. గుంటూరులోని ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగిన ‘ఏఐ ఫర్ ఏపీ పోలీసు’ హ్యాకథాన్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా జాతీయ స్థాయిలో మొదటిసారిగా ఏఐ హ్యాకథాన్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 160 కంపెనీలు నమోదు కాగా.. 60 కంపెనీలను ఎంపిక చేశామని తెలిపారు. విజ్ఞాన భాగస్వామిగా ఫోర్‌సైట్ ఏఐ సంస్థ సీఈవో సూర్య, హ్యాకథాన్ నిర్వహణకు ఆర్‌వీఆర్ కాలేజీ సహకారం అందించాయన్నారు. ఈ సాంకేతిక మేథోమథనంలో పోలీసు శాఖకు ఉపయోగపడే పరిష్కారాలు లభించాయమని పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి పెట్టామని, దీని వలన పోలీసు శాఖ పనితీరు కూడా వేగం పెరుగుతుందన్నారు.
ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి హ్యాకథాన్‌లు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు. ‘సాధారణంగా కానిస్టేబుళ్లకు ఎస్‌హెచ్‌వోలు బీట్‌లు వేస్తుంటారు. ఫలానా చోట నేరాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, అక్కడికి వెళ్లి నిఘా పెట్టి, నేరాలు జరగకుండా చూడండని ఆదేశిస్తుంటారు. అయితే ఈ పని రాబోయే రోజుల్లో ఏఐ అప్లికేషన్ చేస్తుంది. ఏ ప్రాంతంలో ఎలాంటి నేరాలు గతంలో జరిగాయి.. ఎక్కడ ప్రశాంతమైన పరిస్థితులున్నాయనే వివరాలను వాయిస్ కమాండ్‌ల ద్వారానే సమాధానం పంపిస్తుంది. వీటికి సంబంధించిన అంచనాలను కూడా ఏఐనే చేసి పంపుతుంది. దీని వలన దొంగలు, సైబర్ నేరగాళ్లను సులభంగా ట్రాక్ చేయొచ్చు. తద్వారా నేరానికి పాల్పడితే ఆటోమేటిక్‌గా గుర్తించే వ్యవస్థ పోలీసు శాఖకు అందుబాటులోకి వస్తుంది’ అని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసు డైరెక్టరేట్ కార్యాలయ అఽధికారులు, జిల్లాల నుంచి వచ్చిన ఐజీ, డీఐజీ, ఎస్పీలు పాల్గొన్నారు.