Agriculture Department: రైతులకు నికరాదాయమే లక్ష్యం
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:13 AM
సాగు ఖర్చులు తగ్గించి, నాణ్యమైన దిగుబడుల ద్వారా రైతులకు నికరాదాయం సమకూరేలా వ్యవసాయశాఖ పంటల వారీగా ప్రణాళికలు అమలు చేయనున్నది.

సాగు ఖర్చులు తగ్గించి, నాణ్యమైన దిగుబడులకు ప్రణాళికలు
విత్తన ఎంపిక నుంచే అన్నదాతలకు మార్గనిర్దేశం
శాస్త్రవేత్తలతో వ్యవసాయశాఖ డైరెక్టర్ చర్చలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సాగు ఖర్చులు తగ్గించి, నాణ్యమైన దిగుబడుల ద్వారా రైతులకు నికరాదాయం సమకూరేలా వ్యవసాయశాఖ పంటల వారీగా ప్రణాళికలు అమలు చేయనున్నది. పంటలు సాగులో ఉన్నప్పుడు క్షేత్రస్థాయి అధికారులు పొలం బడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. విత్తనం ఎంపిక దగ్గర నుంచే రైతులకు సరైన మార్గనిర్దేశం చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు భావిస్తున్నారు. ఇందుకోసం వివిధ పంటల సాగులో ఎదురవుతున్న సమస్యలపై ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, ఇతరత్రా సాగు ఖర్చులు తగ్గించి, నాణ్యమైన అధిక ఉత్పత్తులు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. సన్న బియ్యంసాగుపై ఇటీవల వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు.
ఆహార వినియోగదారుల ప్రాధాన్యత, ఎగుమతులకు అనువైన వరి రకాల సాగుపై చర్చించారు. మార్కెట్‌లో డిమాండ్ లేని రకాల సాగును తగ్గించేసి, సన్నరకాలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. తాజాగా మినుము, కంది, పుల్లశనగ(బెంగాళీగ్రామ్)పై విడివిడిగా చర్చాగోష్టులు నిర్వహించారు. జొన్న, మొక్కజొన్న, తృణ, చిరు ధాన్యాలు, పత్తి తదితర పంటలపైనా త్వరలో చర్చించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. చీడపీడలు తట్టుకుని, నాణ్యమైన అధిక ఉత్పత్తి ఇచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడించాలని ఇటీవల వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డ్రోన్లు, ఉపగ్రహాలు, డీప్‌టెక్ సాంకేతిక వినియోగం పెం చాలని సూచించారు. దీంతో పంటలకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుని, సమస్యలను అధిగమించేలా రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో డిల్లీరావు చర్చిస్తున్నారు.
త్వరలో 875 కిసాన్ డ్రోన్లు రైతులకు అందుబాటులోకి రానుండగా, ఈఏడాది మరో వె య్యి వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకుప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. దీంతో వ్యవసాయ పంటల్లో ఎరువులు, క్రిమిసంహారక మందుల పిచికారి, పంట కోతలో యాంత్రీకరణ ఆవశ్యకత, పంట ఉత్పత్తుల శుద్ధీకరణపైనా రైతులు దృష్టి సారించేలా అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో శాఖల వారీగా సదస్సులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ధేశించడంతో అధికారులు ఆ దిశగా సిద్ధమవుతున్నారు.