Visakhapatnam : విశాఖలో వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Feb 18 , 2025 | 03:52 AM
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మల్లివీడు గ్రామానికి చెందిన రేణుకా మహంతి కాళ్లు, చేతులు లాగేయడం, తీవ్రమైన జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలతో

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ
గుండెపోటు అంటున్న సూపరింటెండెంట్
విశాఖపట్నం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్)తో విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 63 ఏళ్ల వృద్ధురాలు మృతిచెందారు. చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె మరణించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మల్లివీడు గ్రామానికి చెందిన రేణుకా మహంతి కాళ్లు, చేతులు లాగేయడం, తీవ్రమైన జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలతో ఈ నెల 6వ తేదీన ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె మరణించారు. గత 11 రోజుల్లో ఆమెకు సుమారు పది వరకూ ఇమ్యునో గ్లోబులిన్స్ ఇంజెక్షన్లు ఇవ్వగా, అందులో కేజీహెచ్ నుంచి ఒకటి, రెండు మాత్రమే ఇచ్చారు. మిగిలినవి బయట కొనుగోలు చేసినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ సంబంధిత యూనిట్ ఇన్‌చార్జి రాలేదు. వృద్ధురాలి మృతిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆమెకు ఛాతీ నొప్పి రావడంతో పరీక్షలు చేయించామని, అదే సమయంలో గుండెపోటు కారణంగా మృతి చెందినట్టు పేర్కొన్నారు.