Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

BJP: ‘కమలం’ అభ్యర్థులు ఖరారు.. సికింద్రాబాద్‌కు కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:52 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కమలనాథులు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నాలుగు స్థానాలను కైవసం చేసుకునే దిశగా వ్యూహత్మంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

BJP: ‘కమలం’ అభ్యర్థులు ఖరారు.. సికింద్రాబాద్‌కు కిషన్‌రెడ్డి

- హైదరాబాద్‌కు మాధవీ లత

- మల్కాజిగిరి బరిలో ఈటల, చేవెళ్లలో కొండా..

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కమలనాథులు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నాలుగు స్థానాలను కైవసం చేసుకునే దిశగా వ్యూహత్మంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని మరోసారి బరిలోకి దింపుతోంది.

అసదుద్దీన్‌కు పోటీగా మాధవీ లత

హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థిని ఎంపిక చేశారు. విరించి ఆస్పత్రుల చైర్‌పర్సన్‌, లాతామా ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ మాధవీ లత కొంపెల్లాను అధిష్ఠానం ప్రకటించింది. ఈ స్థానానికి మొదటిసారి ఎంపీ అభ్యర్థిగా మహిళను బరిలోకి దింపారు. ఆమె కొంతకాలంగా హైదరాబాద్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె విద్యాభాస్యం పూర్తిగా హైదరాబాద్‌లోనే జరిగింది. సంతోషనగర్‌లో జన్మించిన ఆమె ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి పోటీగా మాధవీ లతను ఎంపిక చేయడంలో హైదరాబాద్‌పై కమలం నేతలు గురిపెట్టినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈటలకు దక్కిన మల్కాజిగిరి

మల్కాజిగిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌(Etala Rajender) బరిలోకి దిగుతున్నారు. ఆయన పేరును అధికారంగా అధిష్ఠానం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ పార్టీ ఇన్‌చార్జీ మురళీధర్‌రావు,ఈటల రాజేందర్‌తో పాటు చాలామంది మల్కాజిగిరి టికెట్‌ ఆశించారు. చివరకు ఈటల రాజేందర్‌కు దక్కింది. గత పార్లమెంట్‌ ఎన్నికలో మల్కాజిగిరి ఎంపీ సీటుకు మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రామచందర్‌ రావు పోటీ చేశారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అవకాశం దక్కింది. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. 2019లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2022లో బీజేపీలో చేరిన ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:52 AM