తుమ్మిళ్లతోనూ తీరని చింత
ABN , First Publish Date - 2023-02-22T23:31:39+05:30 IST
ఆర్డీఎస్కు ప్రత్యామ్నాయంగా ఆయకట్టుకు నీరందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీరందడం లేదు. నిర్దేశిత ఎత్తు కంటే తక్కువ ఎత్తులో నీరు ఉండటంతో పంపింగ్‌లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి.

పథకం కింద పంటలకు అందని నీరు
291.4 మీటర్ల ఎత్తులో ఉంటేనే పంపింగ్‌కు అవకాశం
ప్రస్తుతం 290.8 మీటర్ల ఎత్తులో నీరు
పంపింగ్‌కు ఈ ఏడాది పలుమార్లు ఆటంకం
సుంకేసుల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణ
పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్న ఆయకట్టు రైతులు
గద్వాల, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఆర్డీఎస్కు ప్రత్యామ్నాయంగా ఆయకట్టుకు నీరందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీరందడం లేదు. నిర్దేశిత ఎత్తు కంటే తక్కువ ఎత్తులో నీరు ఉండటంతో పంపింగ్‌లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు పైకి వచ్చినప్పుడు మోటార్లను రన్ చేస్తున్నప్పటికీ.. ఈ ఏడాది పలుమార్లు నీరు దిగువకు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాలువల ద్వారా ఎక్కువ నీటిని విడుదల చేసుకుంటున్నారని, అందుకే తుమ్మిళ్ల లెవల్ కంటే నీరు దిగువకు వెళ్తోందని ఇక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. కేసీ కెనాల్‌కు సంబంధించి 800 క్యూసెక్కులు విడుదల చేసుకోవడానికి ఏపీకి అనుమతి ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా విడుదల చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీం ద్వారా అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఆర్డీఎస్ను ఏళ్లుగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, కాలువలు సరిగా లేకపోవడంతో నీరు అందక నియోజకవర్గ రైతాంగం ఇబ్బందులు పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్డీఎస్కు ప్రత్యామ్నాయంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. సుంకేశుల బ్యాక్ వాటర్ సోర్సుగా తీసుకుని, వాటర్ లెవల్ 291.4 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మోటార్లను రన్ చేసుకునే వీలు ఉంటుంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఆర్డీఎస్ ఎడమ కాలువకు సంబం ధించి 24వ డిస్ర్టిబ్యూటరీ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి చివరి డిస్ర్టిబ్యూటరీ వరకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో 12ఏ డిస్ర్టి బ్యూటరీ నుంచి ఆర్డీఎస్ మొదల వుతుండగా, అక్కడి నుంచి 23 డిస్ర్టిబ్యూటరీ వరకు ఆర్డీఎస్ ద్వారా నే నీరందాలి. కానీ అటు ఆర్డీఎస్ ద్వారా రావాల్సిన నీరు రాకపోగా, ఇటు తుమ్మిళ్ల మొదలయ్యే నీరు తీసుకునేందుకు మోటార్లకు అందడం లేదు.
ఇసుక తవ్వకాలతోనే ఇబ్బంది..
తుంగభద్ర నదికి సంబంధించి రెండు రాష్ర్టాలకు చెరి సగం లాగా బార్డర్లను ఏర్పాటు చేశారు. గతంలో ఇసుక తవ్వకాల సమయంలో సరిహద్దు వివాదం వచ్చినప్పుడు ఈ బార్డర్లను ఫిక్స్ చేశారు. సుంకే శులలో ప్రస్తుతం నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటోంది. నదిలోని ఇసుక కోసం తెలంగాణ తవ్వకాలు జరపడం లేదు. నీటి నిల్వలు ఎక్కు వగా ఉన్న కారణంగా తవ్వకాలు చేపట్టలేని పరిస్థితి ఉంది. అదే సమయంలో ఏపీ మాత్రం యథే చ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడు తోంది. తన సరిహద్దు వరకు నీటి నుంచే ఇసుకను తోడేస్తున్నారు. ఇందుకోసం సముద్రాల్లో ఉపయో గించే డ్రెజ్జింగ్ పద్ధతిన మరబోట్ల ద్వారా ఇసుకను తవ్వుతున్నారు. నదిలో ఏపీ సరిహద్దు ఉన్నంత వరకు ఇసుకను తోడుతుండటంతో అటువైపు పళ్లం ఏర్పడుతోందని రైతులు చెబుతున్నారు. అటువైపు ఎక్కువ నీరు నిలిచి ఉండటం వల్ల ఆంధ్రపదేశ్‌కు పుష్కలంగా సాగునీరు అందుతుండగా, ఎగువన ఉన్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి లెవల్ దిగువలో ఉండటంతో నీరందడం లేదు. ఇటువైపు కూడా నీరందాలంటే ఇసుకను డ్రెజ్జింగ్ పద్ధతిలో తోడటానికి ఇక్కడి అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ రెండు మూడు సార్లు ఇసుక తవ్వకాల కోసం పరిశీలన జరిపినప్పటికీ ఇంకా ఆమోదం తెలపడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దిగువలో నీరు.. పనిచేయని మోటార్లు..
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సుంకేశుల జలాశయం బ్యాక్ వాటర్ సోర్స్‌గా పని చేస్తోంది. ఈ జలాశయంలో నీరు 291.4 మీటర్ల ఎత్తులో ఉంటే తుమ్మిళ్ల మోటార్లను రన్ చేసుకుని.. డిస్ర్టిబ్యూటరీ 23 నుంచి ఆయకట్టుకు నీరందించవచ్చు. అయితే ఈ ఏడాది నీరు నిర్దేశిత ఎత్తులో కాకుండా దిగువలో ఉండటంతో మోటార్లు నడిపించడానికి వీలు కావడం లేదు. ప్రస్తుతం తుమ్మిళ్ల మోటార్ల వద్ద సుంకేశుల ప్రాజెక్టులో నీరు 290.8 మీటర్ల ఎత్తులో ఉంది. నీరు మరో మీటర్ ఎగువన ఉంటే మాత్రమే నీటి పంపింగ్‌కు అవకాశం ఉంటుంది. ఇండెంట్‌కు అనుగుణంగా నీటి విడుదల జరుగుతున్నప్పటికీ, తుమ్మిళ్లకు నీరందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో కేసీ కెనాల్‌కు సంబంధించి నీరు మాత్రం పుష్కలంగా అందుతోందని రైతులు చెబుతున్నారు. ఆర్డీఎస్ కింద చివరి డిస్ర్టిబ్యూటరీ వరకు నీళ్లందే పరిస్థితి కనిపించకపోగా.. ప్రస్తుతం దగ్గరి డిస్ర్టిబ్యూటరీలకు సైతం నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముంది. తుమ్మిళ్ల వద్ద మొత్తం మూడు మోటార్లను ఏర్పాటు చేయగా, కొద్ది రోజులు నీరందింది. ఈ పథకం కింద రిజర్వాయర్లు కూడా లేకపోవడంతో ఆన్‌గోయింగ్ ఉండే డిస్ర్టిబ్యూటరీల ద్వారానే పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంటుంది. రిజర్వాయర్లు ఉంటే నీటి లెవల్ బాగున్నప్పుడు నీటిని సమృద్ధిగా పంపింగ్ చేసుకుని, తర్వాత నీటిని ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా వాడుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
మొక్కజొన్న ఎండుముఖం
నేను ఈ యాసంగిలో ఎడెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ.12 వేల కౌలుతోపాటు రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతోంది. 20 రోజులుగా సాగునీరు రాకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. పొట్ట దశలో ఉన్నప్పుడు సాగునీరు అందకపోతే గింజ సరిగా పట్టక పంట నష్టపోయే అవకాశం ఉంది. పెట్టుబడితోపాటు కౌలు భారం మీద పడితే అప్పులపాలవుతాం.
- నాగరాజు, రైతు, మెన్నిపాడు, మనోపాడు మండలం
ఇండెంట్ పెట్టాం
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీరందించడం కోసం ఇండెంట్ పెట్టాం. నాలుగు రోజుల్లో మోటార్లను ప్రారంభిస్తాం. నీటి లెవల్ 290.8 మీటర్ల వద్ద ఉండటం వల్ల మోటార్లకు నీరు అందడం లేదు. 291.4 మీటర్లు ఉన్నట్లయితే మోటార్లు రన్ అవుతాయి. కేసీ కెనాల్‌కు ఎక్కువ నీరు పోవడం వల్ల తుమ్మిళ్లకు నీరు అందడం లేదు. తుమ్మిళ్ల ఎత్తిపోతల వైపు ఇసుక పేరుకుపోవడంతో పల్లంగా ఉన్న కేసీ కెనాల్‌కే నీరు ఎక్కువగా వెళ్తోంది.
- విజయ్‌కుమార్‌రెడ్డి, ఈఈ, ఆర్డీఎస్