Bihar: గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత

ABN , First Publish Date - 2023-01-28T18:55:43+05:30 IST

పాట్నా: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ఇంట్లో విషాదం..

Bihar: గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత

పాట్నా: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే (Ashwin KUmar Chaubey) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అశ్విన్ కుమార్ తమ్ముడు నిర్మల్ చౌబే శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. బిహార్ లోని భగల్‌పూల్ జిల్లా మయాగంజ్ ఆసుపత్రిలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించినట్టు కుటుంబ సన్నిహితులు శనివారం తెలిపారు. అయితే నిర్మల్ చౌబేను చేర్పించిన ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరని, నర్సులు మాత్రమే ఉన్నారని వారు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నిర్మల్ చౌబే కన్నుమూసినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

''నిర్మల్ చౌబేకు గుండెపోటు రావడంతో రక్తం కక్కుకున్నారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించాం. రెండు గంటల సేపు ఐసీయూలోనే ఉంచారు. సకాలంలో చికిత్స అందకపోవడంతో కన్నుమూశారు. కేంద్ర మంత్రి సోదరుడనే విషయం ప్రస్తావించినప్పటికీ సిబ్బంది చేసిందేమీ లేదు. కేంద్ర మంత్రి సోదరుడికే ఈ పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటి?" అని నిర్మల్ చౌబే బంధువు చందన్ చౌబే వాపోయారు. నిర్మల్ చౌబే మరణించినట్టు వైద్యులు ప్రకటించగానే ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పలువురు మద్దతుదారులు సైతం అక్కడికి చేరుకుని నిరనలకు దిగారు. దీంతో సుమారు రెండు గంటల సేపు ఆందోళన కొనసాగింది. సిటీ ఎస్‌పీ ఆనంద్ కుమార్‌తో పాటు చుట్టపక్కలు ఆరు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకుని చౌబే కుటుంబ సభ్యులను శాంతింపచేశారు.

ఇద్దరు వైద్యుల సస్పెండ్

కాగా, ఐసీయూలో వైద్యులెవరూ అందుబాటులో లేరంటూ నిర్మల్ చౌబే కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెట్ డాక్టర్ అసిం కుమార్ దాస్ స్పందించారు. ఆసుపత్రి సీనియర్ డాక్టర్లు మందులు ఇచ్చి, ఐసీయూకు షిఫ్ట్ చేసినట్టు ఆయన చెప్పారు. అయితే, ఐసీయూలో డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరని, ఇందుకు సంబంధించి ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశామని తెలిపారు. కాగా, తమకు ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని భగల్‌పూర్ ఎస్‌పీ అజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ఫిర్యాదు అందితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Updated Date - 2023-01-28T19:09:16+05:30 IST