హీరో .. హ్యారీ
ABN , Publish Date - Feb 25 , 2026 | 06:08 AM
క్లిష్ట పరిస్థితుల్లో హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100) హీరోచిత శతకంతో.. ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. సూపర్-8లో భాగంగా మంగళవారం గ్రూప్-2లో హోరాహోరీగా జరిగిన...
సెమీస్‌లో ఇంగ్లండ్
పాకిస్థాన్ ఢమాల్
టీ20 వరల్డ్‌కప్ సూపర్-8
పల్లెకెలె: క్లిష్ట పరిస్థితుల్లో హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100) హీరోచిత శతకంతో.. ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకొంది. సూపర్-8లో భాగంగా మంగళవారం గ్రూప్-2లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత పాక్ 20 ఓవర్లలో 164/9 స్కోరు చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ధ శతకం వృథా అయింది. డాసన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 166/8 స్కోరు చేసి గెలిచింది. విల్ జాక్స్ (28) రాణించాడు. షహీన్ షా అఫ్రీది 4 వికెట్లు దక్కించుకొన్నాడు. బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఆరంభంలోనే తడబడినా..: ఛేదనలో ఆరంభంలోనే పేసర్ అఫ్రీది భయపెట్టినా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన కెప్టెన్ బ్రూక్ ధాటిగా ఆడుతూ ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్లు సాల్ట్ (0), బట్లర్ (2)తోపాటు బెథల్ (8)ను తన వరుస ఓవర్లలో అవుట్‌చేసిన అఫ్రీది.. 35/3తో ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ, బ్రూక్.. మిగతా బౌలర్లే లక్ష్యంగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. ఆరో ఓవర్‌లో నవాజ్ బౌలింగ్‌లో బ్రూక్ 4,4,6తో 17 పరుగులు రాబట్టడంతో.. ఇంగ్లండ్ 53/3తో పవర్‌ప్లేను ముగించింది. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లోనే బాంటన్ (2)ను తారిక్ వెనక్కిపంపాడు. ఈ దశలో కర్రాన్ (16)తో కలసి స్కోరు బోర్డును నడిపించిన బ్రూక్.. 10వ ఓవర్‌లో సింగిల్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. అయితే, కర్రాన్‌ను తారిక్ అవుట్ చేయడంతో.. ఐదో వికెట్‌కు 45 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీకి బ్రేక్ పడింది. అయితే, జాక్స్‌తో కలసి బ్రూక్ 52 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేశాడు. చివరి 4 ఓవర్లలో విజయానికి 27 పరుగులు కావాల్సి ఉండగా.. 17వ ఓవర్‌లో అఫ్రీది బౌలింగ్‌లో 4,6,4తో సెంచరీ పూర్తి చేసుకొన్న బ్రూక్.. చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆఖరి 12 బంతుల్లో 5 పరుగులు అవసరమైన దశలో జాక్స్, ఓవర్టన్ (0)ను నవాజ్ అవుట్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో జోఫ్రా ఆర్చర్ (5 నాటౌట్) బౌండ్రీ బాదడంతో ఇంగ్లండ్ సంబరాల్లో మునిగిపోయింది.
నిలిచిన ఫర్హాన్: అంతకుముందు ఫర్హాన్ విలువైన భాగస్వామ్యాలతో ఆదుకోవడంతో పాక్ పోరాడగలిగే స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న పాక్.. ఓపెనర్ సయిమ్ అయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ ఆఘా (5) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బాబర్ (25)తో కలసి మూడో వికెట్‌కు 46 రన్స్ జోడించిన ఫర్హాన్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. బాబర్‌ను ఓవర్టన్ బౌల్డ్ చేసినా.. ఆ తర్వాత వచ్చిన ఫఖర్ జమాన్ (25), ఫర్హాన్ నాలుగో వికెట్‌కు 49 రన్స్ జతచేశారు. ఆఖర్లో షాదాబ్ (23) దూకుడుగా ఆడి జట్టు స్కోరును 160 దాటించాడు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 20 ఓవర్లలో 164/9 (ఫర్హాన్ 63, బాబర్ 25; డాసన్ 3/24, ఓవర్టన్ 2/26).
ఇంగ్లండ్: 19.1 ఓవర్లలో 166/8 (బ్రూక్ 100, జాక్స్ 28; అఫ్రీది 4/30, నవాజ్ 2/26).
గ్రూప్-2
జట్టు మ్యా గె ఓ ర పా ర.రే
ఇంగ్లండ్ 2 2 0 0 4 1.491
న్యూజిలాండ్ 1 0 0 1 1 0.000
పాకిస్థాన్ 2 0 1 1 1 -0.461
శ్రీలంక 1 0 1 0 0 -2.550
మ్యా: మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి;
ర: రద్దు; పా: పాయింట్లు; ర.రే: రన్‌రేట్
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ