నాసా యవనికపై తెలుగు మార్క్
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:42 AM
మార్క్ సుబ్బారావు నార్త్ కరొలినా రాష్ట్రం షార్లెట్‌లో ఉపాధ్యాయుల సుబ్బారావు, రెజీనా దంపతులకు జన్మించారు. న్యూజెర్సీలోని మోరిస్టౌన్లో హైస్కూల్ చదువు పూర్తి చేశారు.
విశ్వరహస్యాలను అద్భుత చిత్రాలుగా మారుస్తున్న శాస్త్రవేత్త మార్క్ సుబ్బారావు
అందుకు గుర్తింపుగా ఒక గ్రహశకలానికి సుబ్బారావు పేరు
(డాలస్ నుంచి కిలారు గోకుల్ కృష్ణ)
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’లో తెలుగు మూలాలున్న శాస్త్రవేత్త.. ఉపాధ్యాయుల మార్క్ సుబ్బారావు. ఆరేళ్లుగా ఆయన నాసా సైంటిఫిక్ విజువలైజేషన్ స్టూడియోకు సారథ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆధ్వర్యంలోని బృందం.. అనంత విశ్వానికి సంబంధించి నాసా ఉపగ్రహాలు, సూపర్ కంప్యూటర్ల నుంచి వచ్చే సంక్లిష్టమైన శాస్త్ర, సాంకేతిక సమాచారాన్ని క్రోడీకరించి సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా అందమైన చిత్రాలు, యానిమేషన్లుగా రూపొందిస్తోంది. విశ్వరహస్యాలను అద్భుతంగా ఆవిష్కరిస్తోంది. అంతేకాదు.. చంద్రుడిపై అధ్యయనానికి 1972 తర్వాత నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత మిషన్ ఆర్టెమి్స-2లో పాల్గొంటున్న వ్యోమగాములకు మార్క్ నేతృత్వంలోని బృందమే పలు అంశాలపై తర్ఫీదు ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3.54 గంటలకు ఆర్టెమిస్-2 మిషన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మార్క్ సుబ్బారావు ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
మార్క్ సుబ్బారావు నార్త్ కరొలినా రాష్ట్రం షార్లెట్‌లో ఉపాధ్యాయుల సుబ్బారావు, రెజీనా దంపతులకు జన్మించారు. న్యూజెర్సీలోని మోరిస్టౌన్లో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. తండ్రి భౌతిక శాస్త్రవేత్త కావడంతో బాల్యంలో ఇంట్లో శాస్త్రీయ వాతావరణం ఉండేదని..టీవీ కార్యక్రమాల ద్వారా తనకు కూడా భౌతికశాస్త్రం పట్ల మరింత ఆసక్తి కలిగిందని మార్క్ తెలిపారు. హైస్కూల్లో చదివేటప్పుడు చదివిన కార్ల్ సాగన్ ‘కాస్మోస్’, ఆర్థర్ క్లార్క్ ‘ఏ స్పేస్ ఒడిస్సీ’ వంటి సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు తనలో ఖగోళ శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించాయని ఆయన తెలిపారు.
పాఠశాల దశలో బేస్‌బాల్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ మార్క్‌కు జట్టులో చోటు దొరక్కపోవడంతో.. పూర్తిగా ఖగోళ శాస్త్రంపై దృష్టి మళ్లించాలని నిర్ణయించుకుని ఆ దిశగా పట్టుదలతో సాగారు. పెన్సిల్వేనియాలోని లీహై యూనివర్సిటీ నుంచిఇంజినీరింగ్ ఫిజిక్స్‌లో బ్యాచిలర్స్ పూర్తిచేశారు. గెలాక్సీల పరిణామక్రమంపై అధ్యయనం చేసి.. మేరీల్యాండ్‌లోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుండి 1996లో పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో పోస్ట్-డాక్‌గా చేరి విశ్వంలోని గెలాక్సీల త్రీడీ మ్యాప్‌ల రూపకల్పన నిమిత్తం ఏర్పాటు చేసిన ‘స్లోన్ డిజిటల్ స్కై సర్వే’ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాలు, ఆప్టికల్ ఫైబర్లు,స్పెక్ట్రోగ్రాఫ్లను ఉపయోగిస్తూ 1999 నుంచి 2009 మధ్య విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. ఇదే ఆయన కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. ఈ పరిశోధనలో భాగంగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా.. కుజుడికి, గురుడికి మధ్య ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఉన్న ఒక గ్రహశకలానికి ఆయన పేరు (170009 సుబ్బారావు అని) పెట్టారు. స్లోన్ సర్వే అనుభవంతో డిజిటల్ టెక్నాలజీని ఆకళింపు చేసుకున్న మార్క్.. దాన్ని చికాగోలోని ఆడ్లర్ ప్లానెటేరియం ప్రదర్శనల్లో వినియోగించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ ప్లానెటేరియంలో 18 ఏళ్లు సేవలందించిన ఆయన 2019-20 నడుమ అంతర్జాతీయ ప్లానెటేరియం సొసైటీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ప్లానెటేరియాల్లో కేవలం నక్షత్రాల ప్రదర్శన మాత్రమే గాక గెలాక్సీలు, కాస్మాలజీ, అంతరిక్షం, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను ప్రదర్శించాలని ఆయన పేర్కొనేవారు. 2019లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ప్లానెటేరియం సమావేశంలో పాల్గొనిప్రదర్శనలు ఇచ్చారు.
నాసాలో ప్రస్తుత బాధ్యతలు
ఆడ్లర్ ప్లానెటేరియంలో 18 ఏళ్లపాటు సేవలందించిన అనంతరం.. 2020 డిసెంబరులో ఆయన మేరీల్యాండ్‌లోని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో సైంటిఫిక్ విజువలైజేషన్ స్టూడియో సారథిగా చేరారు. నాసా ఉపగ్రహాల నుండి, సూపర్ కంప్యూటర్ల నుండి వచ్చిన డేటాను ఉపయోగించి అద్భుతమైన వీడియోలు, చిత్రాలను తన బృందంతో కలిసి రూపొందించి, శాస్త్రీయ సమాచారాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. అంతరిక్షం గురించే కాదు.. భూమి సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న తీరు గురించి 2023లో ‘క్లైమేట్ స్పైరల్’ అనే వీడియో ద్వారా వివరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అమెరికా చివరిసారిగా 1972లో అపోలో17 మిషన్ ద్వారా మానవులను చంద్రుని మీదకు పంపింది. 54 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఇప్పుడు మానవసహిత రాకెట్‌ను చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు పంపనుంది. ఇంతటి కీలకమైన ఆర్టెమిస్-2 మిషన్‌లో పాల్గొనబోయే నలుగురు వ్యోమగాములకు మార్క్ నేతృత్వంలోని బృం దం ఫోటోగ్రఫీలో శిక్షణ ఇస్తోంది. ఏఐ వినియోగం గురించి మార్క్‌ను ప్రశ్నించగా.. నాసా ఇప్పటికే తన సొంత మోడళ్ల ఆధారంగా చాట్ జీఎ్సఎ్ఫసీ పేరిట కృత్రిమ మేధను అభివృద్ధి చేసుకున్నట్టు వివరించారు. తాను కృషి చేసి విజ్ఞాన సముపార్జన చేసినప్పటికీ ఇతర రంగాలతో అనుసంధానం కావడం వలనే విజయాలు అందుకున్నానని మార్క్ అన్నారు. తన ఇద్దరు కుమారులు కూడా టెక్నాలజీ రంగంలోనే ఉన్నారని తెలిపారు. ఒకరు మెడికల్ డేటా విజువలైజేషన్లో, మరొకరు ఏఐ సేఫ్టీపై పనిచేస్తున్నారని చెప్పారు.
తెలుగు సినిమాలు చూస్తుంటా..
తెలుగు రాష్ట్రాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని మార్క్ సుబ్బారావు తెలిపారు. అప్పుడప్పుడూ తన తండ్రితో కలిసి తెలుగు సినిమాలు చూస్తుంటానని వెల్లడించారు.
కాకినాడలో జన్మించి..
1962లో అమెరికాకు చేరిన మార్క్ తండ్రి ఉపాధ్యాయుల సుబ్బారావు
మార్క్ తండ్రి ఉపాధ్యాయుల సుబ్బారావు 1941 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించారు. ఆయన బాల్యం సికింద్రాబాద్, నాగపూర్, జబల్పూర్, ఎర్నాకుళం వంటి ప్రాంతాల్లో గడిచింది. బోలారం హైస్కూల్లో చదివేటప్పుడు.. పుస్తకాలపై ఆసక్తి పెంచుకుని, పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేశారు. ముంబైలోని సిద్ధార్థ కాలేజీ నుండి ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ, స్టాటిస్టిక్స్‌లో బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. సెయింట్ జేవియర్స్‌లో కొంతకాలం పాఠాలు చెప్పి.. పీహెచ్డీ చేసేందుకు 1962లో అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్ రాష్ట్రం ట్రాయ్లోని రెన్సీలర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో చేరారు. 1963లో ఎయిర్ రిడక్షన్ కంపెనీ(ఎయిర్కో)లో జూనియర్ ఇంజనీర్‌గా ఏడాదికి 8 వేల డాలర్ల జీతానికి చేరి లేజర్ టెక్నాలజీపై కీలక పరిశోధనలు చేశారు. 1998లో తాను భారతదేశానికి చివరిసారి వెళ్లానని మార్క్ తండ్రి సుబ్బారావు తెలిపారు. తమ కుటుంబసభ్యులు ఇప్పటికీ మల్కాజ్గిరి ప్రాంతంలో నివసిస్తున్నట్లు చెప్పారు. 1966లో ఆయన రెజీనాను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడే మార్క్ సుబ్బారావు.