Youth Creates Ruckus: సైకోగా మారిన వన్‌సైడ్ లవర్.. యువతిపై కక్ష గట్టి..
ABN , Publish Date - Jul 23 , 2025 | 09:03 PM
Youth Creates Ruckus: యువతిని వెతుక్కుంటూ ఆమె పని చేస్తున్న సూపర్ మార్కెట్‌కు వచ్చాడు ఓ యువకుడు. అదే మార్కెట్‌లో కత్తి కొని ఆమెపై దాడి చేయడానికి మార్కెట్ బయట కాచుకుని ఉన్నాడు.

హైదరాబాద్: ప్రేమ పేరుతో మోసాలు, హత్యలు ఎక్కువైపోయాయి. కొంతమంది అవసరాల కోసం ప్రేమను వాడుకుంటున్నారు. మరికొంతమంది ప్రేమించిన వాళ్లు దక్కకపోతే వారి ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి కాదందని సైకోగా మారాడు. ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. అమ్మాయి అదృష్టం బాగుండి తప్పించుకుంది. అతడు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామరం గ్రామానికి చెందిన 21 ఏళ్ల వినయ్ గత రెండేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక యువతి కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత యువతి ఓ సూపర్ మార్కెట్‌లో పనికి చేరింది. ఊరు మారినా.. వినయ్ మాత్రం వాళ్లను వదలిపెట్టలేదు.
యువతిని వెతుక్కుంటూ ఆమె పని చేస్తున్న సూపర్ మార్కెట్‌కు వచ్చాడు. అదే మార్కెట్‌లో కత్తి కొని ఆమెపై దాడి చేయడానికి మార్కెట్ బయట కాచుకుని ఉన్నాడు. ఇది గమనించిన యువతి స్టోర్ రూములోకి వెళ్లి దాక్కుంది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు. స్థానికుల సాయంతో వినయ్‌ను పట్టుకుని చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి
రూ.250ల ఈ ఫుడ్ అంటే అంబానీ ఫ్యామిలీకి చాలా ఇష్టం..
ర్యాపిడో ఎక్కి భయపడ్డ యువతి.. కొద్దిసేపటి తర్వాత..