Yadagirigutta: యాదగిరిగుట్టలో శంఖు, చక్ర, నామాల పునరుద్ధరణ!
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:21 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపై శంఖు, చక్ర, నామాలు పునరుద్ధరించేందుకు అధికారులు యోచిస్తున్నారు.

టెండర్లు పిలిచేందుకు అధికారుల నిర్ణయం
యాదగిరిగుట్ట, జూలై 11(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపై శంఖు, చక్ర, నామాలు పునరుద్ధరించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఆలయ ఉద్ఘాటన అనంతరం కనుమరుగైన వీటిని ప్రసాదాల తయారీ కేంద్రం పైభాగంలో బిగించేందుకు నిర్ణయించారు. ఈవో ఎస్.వెంకట్రావు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.
శంఖు, చక్ర, నామాల బిగింపు ప్రక్రియతోపాటు రాత్రి వేళ ధగధగ మెరిసేలా ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే భక్తులు మొక్కు వెంట్రుకలు సమర్పించేందుకు కొత్తగా తులసీకాటేజీలో మరో కల్యాణ కట్ట అందుబాటులోకి రానుంది. దేవస్థానానికి సంబంధించి అద్దె గదుల సముదాయం ఇక్కడే ఉన్నందున భక్తులకు అనుకూలంగా ఉంటుందని ఈవో నిర్ణయించారు.