World Sleep Day: నిద్ర లేమితో గుండె జబ్బులు!
ABN , Publish Date - Mar 15 , 2025 | 04:05 AM
మనిషికి నిద్ర అనేది అత్యవసరం. కంటి నిండా నిద్ర పోతే కలిగే మేలు ఎంతో.. కలత నిద్రతో జరిగే కీడూ అంతే! చాలామంది నిద్రాహారాలు మానేసి కష్టపడతున్నామని చెబుతుంటారు.

అల్జీమర్స్ సహా అనేక అనారోగ్య సమస్యలు
గురక.. నిద్రలేమికి సంకేతం
అరెథ్మియా, హార్ట్ ఫెయిల్యూర్ రోగుల్లో 30-60% మందికి మంచి నిద్రతో సత్ఫలితాలు
నిద్ర ఏకధాటిగా 6-8 గంటలు ఉండాలి
మధ్యాహ్నం 30 నిమిషాల కునుకుతో మేలు
‘స్మార్ట్’ పరికరాలతో సమస్యలే ఎక్కువ!
‘వరల్డ్ స్లీప్ డే’ సందర్భంగా ఏఐజీ హాస్పిటల్స్ సదస్సులో వైద్యుల వెల్లడి
హైదరాబాద్ సిటీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మనిషికి నిద్ర అనేది అత్యవసరం. కంటి నిండా నిద్ర పోతే కలిగే మేలు ఎంతో.. కలత నిద్రతో జరిగే కీడూ అంతే! చాలామంది నిద్రాహారాలు మానేసి కష్టపడతున్నామని చెబుతుంటారు. కానీ, తగినంతగా నిద్రపోకపోతే అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రపంచ నిద్ర దినోత్సవం (వరల్డ్ స్లీప్ డే)’ సందర్భంగా శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో ‘నిద్ర సమస్యలను అధిగమించడం’ పేరిట ఓ చర్చ నిర్వహించారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిద్ర మన జీవితంలో అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటన్నారు. జీవితంలో మూడో వంతు సమయం నిద్రలోనే గడుపుతుంటామని, దురదృష్టవశాత్తు దీని గురించి చాలామందికి అవగాహన తక్కువగా ఉంటుందని చెప్పారు. నిద్రకు, గుండెకు మధ్య ఉన్న సంబంధం గురించి డాక్టర్ నరసింహన్ వివరించారు. ఎన్నో దశాబ్దాలుగా కార్డియో వాస్క్యులర్ వ్యాధుల కారకాలలో నిద్ర ఒకటనే సంగతిని చాలామంది మరిచిపోతున్నారన్నారు. గుండె జబ్బులు, అరెథ్మియా, హార్ట్ ఫెయిల్యూర్ రోగుల్లో తగినంత నిద్ర ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటున్నాయని చెప్పారు. దాదాపు 30-60ు మంది రోగుల్లో నిద్ర సరిగా ఉంటే అరెథ్మియా, హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు గణనీయంగా తగ్గుతున్నాయని తెలిపారు. నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తే కార్డియో వాస్క్యులర్ సమస్యలను కూడా చాలా వరకూ నయం చేయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయన్నారు. కొందరికి 6 గంటలు నిద్రపోతే చాలని.. ఇంకొందరికి 8 గంటల నిద్ర కూడా చాలదని తెలిపారు.
స్లీప్ అప్నియా..
నిద్ర లేమి సమస్యలు చాలా రకాలున్నాయని, వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది స్లీప్ అప్నియా అని డాక్టర్ విశ్వనాథ్ చెప్పారు. ఈ సమస్య ఉన్నవారు నిద్ర సమయంలో తగినంతగా శ్వాస తీసుకోలేరని, ఫలితంగా ఆక్సిజన్ స్థాయులు కూడా తగ్గుతాయని తెలిపారు. స్లీప్ అప్నియా రెండు రకాలన్నారు. ముక్కు, గొంతులో అవరోధాల వల్ల తగినంతగా గాలి శ్వాసకోశాలకు అందకపోవడాన్ని అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారన్నారు. రెండోది సెంట్రల్ స్లీప్ అప్నియా అని చెప్పారు. మెదడు నుంచి శ్వాసకోశాలకు ప్రభావవంతంగా శ్వాస తీసుకోవడం కోసం సంకేతాలు అందాలని, కొన్ని సార్లు ఇవి పూర్తిగా అందవని, ఫలితంగా తగినంత శ్వాస తీసుకోలేరని వివరించారు. ఇక గురక పెడితే బాగా నిద్రపోతున్నామని ఎక్కువ మంది అనుకుంటారని, అది సరికాదని చెప్పారు. గురక అనేది మన శ్వాస ప్రక్రియలో కలుగుతున్న అవరోధాలకు నిదర్శనమన్నారు. ఇటీవలి కాలంలో కొందరు తాము మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 6 గంటలు నిద్రపోతున్నామని చెబుతున్నారని.. అది మంచిది కాదని వివరించారు. మధ్యాహ్నం పూట నిద్ర 20-30 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూదని, రోజువారీ నిద్ర ఒకేసారి 6 లేదంటే 8 గంటలు ఉండాలి తప్ప అంతరాయాలు ఉండకూడదని చెప్పారు. యోగ నిద్ర ఇటీవ ల చాలామందికి ప్రయోజనకరంగా ఉంటోందన్నారు. ఆల్కహాల్ తీసుకున్న వారిలో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లక్షణాలు ఉంటాయని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. ప్రతి వ్యక్తికీ డ్రీమ్ స్లీప్, నాన్ డ్రీమ్ స్లీప్ సమయం తగినంతగా ఉండాలన్నారు. సరైన నిద్ర సమయం ఎంతనేది చెప్పడం కష్టమని తెలిపారు. జ్ఞాపక శక్తి మెరుగుపడడానికి, శారీరక విశ్రాంతికి, మానసిక విశ్రాంతికీ నిద్ర అత్యవసరమని చెప్పారు. నవజాత శిశువులు ఎక్కువగా నిద్రపోతూఉంటారని.. ఫలితంగా వారి మెదడు అభివృద్ధి చెందుతూ ఉంటుందని వివరించారు. వయసు పెరిగే కొద్దీ ఆ నిద్ర తగ్గుతూ ఉంటుందన్నారు. పెద్దలు కచ్చితంగా 7 గంటల పాటు నిద్ర పోవాలని చెప్పారు. లేకపోతే అది నిద్ర సంబంధిత లోటుగానే చూడాలన్నారు. ఓ రోజు నాలుగు గంటలు నిద్ర పోయి, వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ఫలితం ఉంటుందా అంటే.. వ్యక్తులను బట్టి ఉండొచ్చని తెలిపారు. ప్రతి వ్యాధికీ నిద్రతో సంబంధం ఉంటుందన్నారు. అయితే వైద్య విద్యలో కానీ, మరెక్కడా కానీ దీని గురించి మాట్లాడరని చెప్పారు. నిద్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అల్జీమర్స్ లాంటి వ్యాధులకూ నిద్రలేమి కారణమని తెలిపారు. కొంతమంది ఇటీవలి కాలంలో స్మార్ట్ వాచ్ లాంటివి ధరించి తమకు నిద్ర సరిగా సరిపోవడం లేదనే సమస్యతో వస్తున్నారని.. అవి మానసిక ఆందోళనకు కారణమవుతున్నాయని చెప్పారు. అందుకే తాను వాటిని సూచించని తెలిపారు.
మానసిక సమస్యలకూ మూలం..
ఎవరైనా మానసిక సమస్యలతో వస్తే మీరు తగినంతగా నిద్రపోతున్నారా? అని అడుగుతామని డాక్టర్ వరూధిని చెప్పారు. నిద్ర లేమి వల్ల కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. నిద్ర సరిగా లేకపోతే చికిత్స కూడా పెద్దగా పనిచేయదని, అందుకే ముందు నిద్రను సరిచేయాలని పేర్కొన్నారు. తర్వాత పోషకాహారం అందించాలన్నారు. ఆ తర్వాత శారీరక వ్యాయామం ఉండాలని చెప్పారు. ఈ మూడూ సరిగా ఉంటే మానసిక సమస్యలకు సరైన చికిత్స అందించవచ్చని వివరించారు. నిద్ర మాత్రలు మంచిదా కాదా అని అంటే, అది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుందని చెప్పారు.