Honeymoon: హనీమూన్ మర్డర్‌లా దొరికిపోవొద్దు!
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:23 AM
అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు.

మేఘాలయలో నిందితులు ఏదో పొరపాటు చేశారు
మనం మాత్రం పక్కాగా ప్లాన్ చేయాలి
హత్య జరిగాక హనీమూన్‌కు లద్ధాఖ్ వెళ్లాలి
హత్య ఆలస్యమైతే విహారానికి అండమాన్‌కు పోవాలి
తేజేశ్వర్ హత్యకు ముందు ఐశ్వర్య, తిరుమలరావు ప్రణాళిక
బ్యాంకు లోన్ ఇచ్చి ఐశ్వర్య తల్లిని లోబర్చుకున్న తిరుమలరావు
గద్వాల హత్య కేసును ఛేదించిన పోలీసులు.. 8మంది అరెస్టు
గద్వాల క్రైం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ‘అనుకున్నట్లుగానే హత్య చేయాలి.. అయితే మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటనలో దుండగుల మాదిరిగా దొరికిపోకూడదు. మనం ఎలాంటి పొరపాటు జరగకుండా పక్కాగా పనికానిచ్చేద్దాం’ తేజేశ్వర్ హత్య కోసం ఆయన భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు వేసుకున్న ప్రణాళిక ఇది!! తేజేశ్వర్‌ను చంపిన తర్వాత ఇద్దరూ లద్ధాఖ్‌కు హనీమూన్ వెళ్లాలనీ అనుకున్నారు. అనుకోని కారణాల వల్ల హత్య ఆలస్యమైతే ఆషాఢమాసంలో అండమాన్ లేదా మరే ఇతర ప్రాంతానికైనా విహారానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే తేజేశ్వర్‌ను చంపించినా పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యారు. గద్వాలకు చెందిన తేజేశ్వర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణం అని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఏపీలోని కర్నూలుకు చెందిన తిరుమలరావు వివాహితుడు. బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆఫీసులో పనిచేసే స్వీపర్ సుజాతకు హోమ్ లోన్ ఇప్పించి.. ఆర్థిక అవసరాలు తీరుస్తూ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె కూతురు ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్యను నమ్మించాడు. గత డిసెంబరులో ఐశ్వర్యకు గద్వాలలో ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్న తేజేశ్వర్‌తో నిశ్చితార్థం జరిగింది.
తర్వాత తాము కలవడం కష్టం కావడంతో తేజేశ్వర్‌ను హత్య చేయాలని ఐశ్వర్య, తిరుమలరావు ప్రణాళిక వేసుకున్నారు. తేజేశ్వర్ హత్యకు.. బ్యాంకు పనిమీద తన వద్దకు వచ్చిన పరశురాముడు, నగేశ్‌కు తిరుమలరావు సుపారీ ఇచ్చాడు. బ్యాంకు నుంచి లోన్లు ఇప్పించే విషయంలో సహకరిస్తానని వారికి మాటిచ్చాడు. ఐశ్వర్యతో వివాహానికి ముందే తేజేశ్వర్‌ను హత్య చేయాలనుకున్నారు. ఈ క్రమంలో నగేశ్, పరశురాముడు పలుమార్లు తేజేశ్వర్ హత్యకు ప్రణాళిక వేసినా సాధ్యపడలేదు. తిరుమలరావు సూచనతో నగేశ్, పరశురాముడు కలిసి తేజేశ్వర్ కదలికలు తెలుసుకునేందుకు ఆయన బైక్‌కు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. మే నెల 18న ఐశ్వర్య-తేజేశ్వర్ వివాహం జరిగింది. దీంతో మరింత రగిలిపోయిన తిరుమలరావు.. నగేశ్, పరశురాముడును పిలిచి ‘‘వాణ్ని చంపండి. ఎంత డబ్బయినా ఇస్తాను’’ అని చెప్పాడు. దీంతో ఆ ఇద్దరు చాకలి రాజు అనే మరో వ్యక్తిని భాగస్వామ్యం చేసుకున్నారు. దారి ఖర్చులకు రూ. 3500 తీసుకున్నారు. ఓ కారును నెల రోజుల కోసం అద్దెకు తీసుకున్నారు. జూన్ 17న ముగ్గురు కలిసి గద్వాల వచ్చారు. తేజేశ్వర్‌కు ఫోన్ చేసి రప్పించుకొని కారులో ఎక్కించుకున్నారు. తమ మేనేజర్ అని చెప్పి తిరుమల్‌రావుతో మాట్లాడించారు. ఆ తర్వాత తమకు తెలిసిన వారి కారు ఆగిపోయిందని చెప్పి.. కారును కర్నూలువైపు పోనిచ్చారు. ఓ 20 కి.మీ వెళ్లాక వారు ఫోన్ ఎత్తడం లేదంటూ గద్వాలకు యూటర్న్ తీసుకున్నారు.
తల, గొంతు, పొట్టలో కత్తితో దాడి
గద్వాలకు వస్తుండగా పరశురాముడు సీటు కింద ఉన్న కొడవలి తీసుకొని తేజేశ్వర్ తలపై కొట్టాడు. నగేశ్ కారును సైడ్‌కు ఆపిన తర్వాత అదే కొడవలితో పరశురాముడు తేజేశ్వర్ గొంతు కోశాడు. చాకలి రాజు మరో కొడవలితో తలపై, చేతులపై నరికాడు. నగేశ్ కత్తితో కడుపులో పొడవడంతో తేజేశ్వర్ చనిపోయాడు. తర్వాత తిరుమల్‌రావుకు ఫోన్ చేశారు. డెడ్‌బాడీని పంచలింగాల వద్ద వెంచర్‌కు తీసుకురావాలని అతడు చెప్పాడు. దారిలో బ్రిడ్జి వద్ద తేజేశ్వర్ బ్యాగ్, ఫోన్లను నదిలో పడేశారు. తిరుమలరావు తన కారులో వచ్చి ముగ్గురికి కొత్త డ్రెస్సులు ఇచ్చాడు. తర్వాత పరశురాముడు, చాకలిరాజును అక్కడే వదిలేసి నగేశ్‌తో కలిసి తిరుమలరావు కారులో నంద్యాల వైపు బయలుదేరి సుగానిమిట్ట వద్ద నిర్మిస్తున్న గాలేరు-నగరి కాల్వలో మృతదేహాన్ని పడేశాడు. మరుసటిరోజు నగేశ్‌కు తిరుమలరావు 50 వేలు ఇచ్చాడు. 20వ తేదీన మరో 2 లక్షలు తెలిసిన వ్యక్తితో ఇప్పించాడు. ఈ ఘటనకు సంబంధించి తిరుమలరావు, ఐశ్వర్య, నగేశ్, పరశురాముడు, చాకలి రాజు, ఐశ్వర్య తల్లి సుజాత, తిరుమలరావు తండ్రి తిరుపతయ్య సహా 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకుపయోగించిన కారు, కొడవళ్లు, 1.20 లక్షల నగదు, 10 మొబైల్ ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News