Warangal Cotton Crisis: పత్తి కొనుగోళ్లపై గందరగోళం.. ఆందోళనలో అన్నదాతలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:05 PM
పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రైతులు పత్తి తరలించకపోవడంతో ఏనుమాముల మార్కెట్ యార్డు బోసిపోయింది.
వరంగల్, నవంబర్ 17: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ తీరుపై రైతులు, జిన్నింగ్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొత్త కొర్రీలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు, వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు. బంద్ పిలుపు నేపథ్యంలో రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకురాని పరిస్థితి. దీంతో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ బోసిపోయింది. పత్తి కొనుగోళ్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. తీసిన పత్తిని అమ్ముకోలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
పత్తి రైతుల బాధలపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. మద్ధతు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే... మంత్రులు, ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని ఫైర్ అయ్యారు. రైతులకు మద్దతు ధర కోసం బీఆర్ఎస్ నిరసనకు దిగుతుందని వెల్లడించారు.
కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిల్ చేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపొందారని.. నీళ్లు బంద్ చేస్తాం, పెన్షన్లు బంద్ పెడతామని బెదిరించారని మరో బీఆర్‌ఎస్ నేత రాజయ్య ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యలు చేశారు. పత్తి రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దొంగే దొంగా అన్నట్టుగా రేవంత్ పాలన ఉందనిమండిపడ్డారు. రేపు (మంగళవారం) హరీష్‌రావు ఆధ్వర్యంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిరసనకు దిగుతామని రాజయ్య పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
సౌదీ ప్రమాదం... రెండు కుటుంబాల్లోని వారంతా
Read Latest Telangana News And Telugu News