Vivek Venkataswamy: గిగ్ వర్కర్ల కోసం త్వరలో చట్టం: వివేక్
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:05 AM
గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ఓ చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి జి.వివేక్ వెంకటస్వామి తెలిపారు.

హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ఓ చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి జి.వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్ల నమోదు, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రత్యేకంగా ఓ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆన్‌లైన్ బిజినెస్ సంస్థల ప్రతినిధులు, గిగ్ వర్కర్లతో మంత్రి వివేక్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు నాలుగన్నర లక్షల మంది జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ బిజినెస్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలోని గిగ్ వర్కర్ల కోసం ఓ చట్టాన్ని తీసుకువస్తున్నామని, ఇందుకు సంబంధించి ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని చెప్పారు. కనీస వేతన అంశంతోపాటు మరికొన్ని డిమాండ్లను శుక్రవారం నాటి భేటీలో గిగ్ వర్కర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశానికే ఆదర్శంగా నిలిచేలా గిగ్‌వర్కర్ల కోసం చట్టాన్ని తీసుకువస్తానమి వివేక్ వివరించారు. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ చట్టం ముసాయిదాను మంత్రిమండలి ముందు ఉంచుతామని తెలిపారు.