Student Harassment: ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:51 AM
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బీసీ సంక్షేమ వసతిగృహంలో ఇద్దరు విద్యార్థులు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతున్నారు.

హుస్నాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని బీసీ సంక్షేమ వసతిగృహంలో ఇద్దరు విద్యార్థులు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ పట్టణానికి చెందిన మనోజ్, ఆనంద్ హుస్నాబాద్ బీసీ హాస్టల్‌లో ఉంటూ స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు విద్యార్థులు ఇతర విద్యార్థుల తినుబండారాలను తినడంతో.. వారు వార్డెన్ భద్రయ్యకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఇద్దరు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లి ఉపాధ్యాయుల ఎదుట.. చెడు వ్యసనాలు మానకపోతే ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు.
అనంతరం హాస్టల్‌కు వెళ్తున్నామని చెప్పిన విద్యార్థులు సమీపంలోని మామిడి తోటకువెళ్లి పురుగులు మందు తాగారు. గమనించిన విద్యార్థులు వార్డెన్‌కు చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే వీరి ఆత్మహత్యాయత్నంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారు చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో మందలించామని, దీంతో ఈ ఘటనకు పాల్పడ్డారని వార్డెన్ చెబుతున్నాడు. బాధిత విద్యార్థుల్లో ఒకరి తండ్రి మాత్రం హాస్టల్‌లో పనిచేసే ఒకరు.. తమ కుమారుడితో బాత్రూమ్‌లు కడించేవాడని, ఎక్కడ సిగరెట్ కనిపించినా.. తనే తాగుతున్నాడని వేధించడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపించాడు.