Share News

Suryapet: ఔషధ దుకాణంలో లింగ నిర్ధారణ పరీక్షలు

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:54 AM

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఔషధ దుకాణంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని చర్చి కాంపౌండ్‌ రోడ్డులో ఉన్న మహాగణపతి ఔషధ దుకాణంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు

Suryapet: ఔషధ దుకాణంలో లింగ నిర్ధారణ పరీక్షలు

  • యజమాని, స్కానింగ్‌ నిర్వాహకుడి అరెస్టు

భానుపురి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఔషధ దుకాణంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని చర్చి కాంపౌండ్‌ రోడ్డులో ఉన్న మహాగణపతి ఔషధ దుకాణంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు మెటర్నల్‌ చైల్డ్‌హెల్త్‌ ప్రోగ్రాం ఇన్‌చార్జి డాక్టర్‌ నాజియాకు శుక్రవారం సమాచారం అందింది. వెంటనే ఆమె సిబ్బందితో కలిసి తనిఖీకి వెళ్లగా.. అక్కడ లింగ నిర్ధారణ స్కానింగ్‌ యంత్రాన్ని గుర్తించారు. అక్కడున్న నిర్వాహకుడు నల్లగట్టు నగేశ్‌ను ప్రశ్నించగా ‘రూ.5 వేలు ఇస్తే కడుపులో ఉన్నది బాబా, పాప అనేది చెప్పేస్తామని’ బదులిచ్చాడు. కొంతమంది ఆర్‌ఎంపీలతో కలిసి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించాడు. తాను ఓ రేడియాలజిస్ట్‌ వద్ద పనిచేశానని, తన యజమాని వేలాద్రి ఓ వైద్యుడి వద్ద కంపౌండర్‌గా పనిచేసిన అనుభవంతో దుకాణం ఏర్పాటు చేశాడని తెలిపాడు.


డాక్టర్‌ నాజియా ఇచ్చిన సమాచారం మేరకు ఔషధ దుకాణాన్ని సీజ్‌ చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. సూర్యాపేటలో లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహణ కేసులు పెరిగిపోతున్నాయి. కమీషన్లకు కక్కుర్తిపడి ఆర్‌ఎంపీలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం పట్టణంలో పరిపాటిగా మారింది. గతంలోనూ పలు ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లను సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. లింగ నిర్ధారణ పరీక్షలో పుట్టబోయేది ఆడ శిశువు అని తెలిసి అబార్షన్‌ చేయడంతో రక్తస్రావమై ఓ మహిళ మృతి చెందింది. యాపిల్‌ స్కానింగ్‌ సెంటర్‌ వ్యవహారంలో అప్పటి డీఎస్పీతో పాటు సీఐ కూడా సస్పెండ్‌ కాగా డీఎంహెచ్‌వో కోటాచలం బదిలీ అయ్యారు.


న్యాయవిద్య కోర్సుల్లో అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశానికి షెడ్యూల్‌ విడుదలైంది. లాసెట్‌-2025 ద్వారా కోర్సుల్లో ఆగస్టు 4 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కమ్‌ వెరిఫికేషన్‌, ఫీజు చెల్లింపు ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఫిజికల్‌ వెరిఫికేషన్‌ ఆగస్టు 11 నుంచి 14 వరకు ఉంటుంది. తొలి విడత వెబ్‌ ఆప్షన్ల దాఖలు ఆగస్టు 16, 17న ఉంటుంది. కాలేజీల్లో రిపోర్టు చేయడం, ఫీజుల చెల్లింపు ఆగస్టు 22 నుంచి 25వ తేదీ దాకా ఉంటుంది. పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికిగాను ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 1 దాకా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ల ప్రత్యక్ష పరిశీలన ఆగస్టు 27-29 మధ్యలో ఉంటుంది. అర్హులైన విద్యార్థుల వివరాలు సెప్టెంబరు 2న ప్రదర్శిస్తారు. వెబ్‌ఆప్షన్ల దాఖలు సెప్టెంబరు 3, 4 తేదీల్లో ఉంటుంది. ప్రాథమికంగా ప్రవేశానికి అర్హత సాధించిన విద్యార్థుల వివరాలు సెప్టెంబరు 8న ప్రదర్శిస్తారు. మరిన్ని వివరాలకు http//lawcetadm.lgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..

బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..

For Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:54 AM