Tummala: సేంద్రియ వ్యవసాయమే శ్రీరామరక్ష
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:12 AM
సమాజంలో అందరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ముందుకు పోవాలంటే సేంద్రియ వ్యవసాయమే శ్రీరామరక్ష అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

మన పంటలు దేశ, విదేశాలకు ఎగుమతవ్వాలి: తుమ్మల
ఖమ్మంలో సేంద్రియ రైతు బజార్ ప్రారంభం
ఖమ్మం/హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అందరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ముందుకు పోవాలంటే సేంద్రియ వ్యవసాయమే శ్రీరామరక్ష అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన సేంద్రియ రైతుబజార్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా రైతులు అమ్మకానికి తెచ్చిన పలు సేంద్రియ కూరగాయలను మంత్రి పరిశీలించి అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. మన పంటలు, మన వంటలు దేశ, విదేశాలకు ఎగుమతి కావాలని, సేంద్రియ వ్యవసాయంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకంతో భూసారం తగ్గడంతో పాటు కూరగాయలు, తినే ఆహారం కలుషితమై క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఇందుకు పంజాబ్‌నుంచి ఢిల్లీకి వెళ్లే క్యాన్సర్ రైలే ఉదాహరణ అని పేర్కొన్నారు. వేలాది మంది క్యాన్సర్ రోగులు ఆ రైలులో వైద్యంకోసం వెళ్లి వస్తున్నారని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నడ్డానే చెప్పారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కువగా ఎరువులు వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. దానిని క్రమంగా తగ్గించుకోవడానికి రైతులు సేంద్రియం వైపు మళ్లాలని ఆయన సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు మోక్షం కలిగిందని తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కావేటి రాములు అన్నారు. 88 మంది వ్యవసాయశాఖ అధికారులకు పదోన్నతులు కల్పించారని కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం మంత్రి తుమ్మలను కలిసి సన్మానించారు.