Hyderabad Mobile Store: మొబైల్ షాపుకు కన్నం వేసి 5 లక్షల విలువైన ఫోన్లు చోరీ..
ABN , Publish Date - Jul 01 , 2025 | 09:57 AM
Hyderabad Mobile Store: ఆ దొంగ 5 లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్, జులై 1: నగరంలో భారీ చోరీ జరిగింది. ఓ దొంగ మొబైల్ షాపు గోడకు కన్నం వేశాడు. మొబైల్ షాపులోకి ప్రవేశించి రూ.5లక్షల విలువైన ఫోన్లను దోచుకెళ్లిపోయాడు. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగ దిల్‌సుఖ్‌నగర్-కోఠి మెయిన్ రోడ్డులో ఉన్న బిగ్ సీ షో రూమ్ దగ్గరకు వచ్చాడు. మెట్ల వైపు ఉన్న గోడకు ఉలి, సుత్తెతో భారీ కన్నం వేసి దాని గుండా షోరూములోకి ప్రవేశించాడు.
అనంతరం విలువైన ఫోన్లను దోచుకెళ్లాడు. ఆ దొంగ రూ.5లక్షల విలువ చేసే ఫోన్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. షో రూములో ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ దొంగ తనను ఎవ్వరూ గుర్తు పట్టకుండా ఉండటానికి ముఖానికి ఎర్రటి వస్త్రం కట్టుకుని దొంగతనం చేశాడు.
కాగా, అచ్చం ఇలాంటి సంఘటనే మే నెలలో బెంగళూరులో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గోడకు కన్నం వేసి మొబైల్ షాపును దోచేశాడు. అసోంకు చెందిన ఇక్రామ్ ఉల్ హసన్ కొన్ని నెలల క్రితం బెంగళూరుకు వచ్చాడు. అతడు అరెకెరెలో నివాసం ఉండేవాడు. ముందుగా సెంట్రల్ మాల్లో పనిచేశాడు. అక్కడ పని మానేసి డొమినోస్ పిజ్జా షాపులో చేరాడు. సులభంగా డబ్బులు సంపాందించేందుకు దొంగతనం చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ టెలికాం మొబైల్ షాపులో దొంగతనం చేశాడు. 85 ఫోన్లు దోచేశాడు.
ఇవి కూడా చదవండి
7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా.. ఈ వ్యాధులు తప్పవు..
బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..