సెమీ కండక్టర్ మిషన్‌లో.. తెలంగాణకు మద్దతివ్వండి
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:40 AM
సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేంద్రం కూడా సహకరించాలని కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

కాళేశ్వరం-మంథని-రామగిరిని పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించండి
కేంద్ర మంత్రులకు మంత్రి శ్రీధర్ విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 15(ఆంధ్రజ్యోతి): సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేంద్రం కూడా సహకరించాలని కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పలు ప్రముఖ సంస్థలు తెలంగాణలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయని, ఇలాంటి తరుణంలో డేటా భద్రత కీలకంగా మారిందన్నారు. ‘నేషనల్ డిజాస్టర్ రికవరీ జోన్’ ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. వచ్చే నెల 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని అశ్విని వైష్ణవ్‌ను శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
రామగిరి కోటను టూరిజం హబ్‌గా మార్చండి
కాళేశ్వరం-మంథని-రామగిరిని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్‌గా గుర్తించి... అభివృద్థి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీలో ఆయన షెకావత్‌ను కలిశారు. మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్థి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. ‘దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయానికి వేయ్యేళ్లకు పైగా చరిత్ర ఉందని తెలిపారు. ఈ ఏడాది మేలో సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, 30-40 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరించేందుకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. సోమ్‌నాథ్, కేదార్‌నాథ్, మహాకాళేశ్వర్, అయోధ్య, కాశీల మాదిరిగా ప్రత్యేకత కలిగిన ఈ ఆలయాన్ని కూడా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, ఎకో టూరిజం హబ్‌గా అభివృద్థి చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. రామగిరి కోటను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని కోరారు.