Share News

Heatwaves: నిప్పుల కొలిమి

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:31 AM

రాష్ట్రంలో రోజురోజుకి ఎండలు అధికమవుతున్నాయి. 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూ చాలా ప్రాంతాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. ఎండల తీవ్రత, వేసవి తాపం తాళలేక వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

Heatwaves: నిప్పుల కొలిమి

రాష్ట్రంలో రోజురోజుకి అధికమవుతున్న ఎండలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో రోజురోజుకి ఎండలు అధికమవుతున్నాయి. 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూ చాలా ప్రాంతాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. ఎండల తీవ్రత, వేసవి తాపం తాళలేక వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జగిత్యాల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో, నిర్మల్‌ జిల్లా తానూరులో గురువారం అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. ఆ తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌, గొల్లపల్లిలో, నిజామాబాద్‌ జిల్లాలోని సీహెచ్‌ కొండూరు, మల్కాపూర్‌లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌ నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి, ఆదిలాబాద్‌ జిల్లా తాంసిలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం, మంచిర్యాల జిల్లా భీమిని మండలం, నిజామాబాద్‌ జిల్లా మోస్రాలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా మగ్గిడి, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతనమోదైంది. హనుమకొండ, ములుగు, మహబూబాబాద్‌, మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జోగుళాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, వనపర్తి, ఉమ్మడి మెదక్‌ తదితర జిల్లాల్లో 40 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


వడదెబ్బతో నలుగురి మరణం

వడదెబ్బ వల్ల రాష్ట్రంలో గురువారం నలుగురు మరణించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గాంధీనగరం గ్రామానికి చెందిన తాటి లక్ష్ముడు(60), పెనుబల్లి మండలంలోని కొత్తకారాయిగూడెంకు చెందిన నెల్లూరి బోధనాచారి(37), జనగామకు చెందిన అలిసెరి ప్రసాద్‌(63), జగిత్యాల జిల్లా గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన కొల్లూరి గంగారాం (65)తో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు.

వికారాబాద్‌, సంగారెడ్డిలో గాలివాన

వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతా ల్లో గురువారం భారీ వర్షం, ఈదురుగాలులు బీభ త్సం సృష్టించాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండం బిల్కల్‌ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి పడడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలం నిల్వ ఉంచిన ఉల్లి, జొన్న పంటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో సంగారెడ్డి-నర్సాపూర్‌ రోడ్డులో చెట్లు విరిగి పడ్డాయి. గుండ్లమాచునూర్‌ సమీపంలో విద్యుత్‌ తీగలు చెట్లపై తెగి పడటంతో గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.


గోడ కూలి గర్భిణి మృతి

మునిపల్లి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం ఓ గర్భిణి ఉసురు తీసింది. గర్భం దాల్చాననే సంగ తి తెలుసుకుని భర్తతో కలిసి ఆనందంగా స్వగ్రామానికి వెళుతూ భోజనం చేసేందుకు ఓ రెస్టారెంట్‌లో ఆగడమే ఆమె పాలిట శాపమైంది. గాలివాన దెబ్బకు రెస్టారెంట్‌ గోడ కూలి మీద పడడంతో గాయపడి గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో జరిగిన ఈ దుర్ఘటనలో శ్రావణి (22) అనే గర్భిణి చనిపోగా, ఆమె భర్త విజయ్‌కుమార్‌ గాయపడ్డాడు. మునిపల్లి మండలం పోల్కంపల్లికి చెందిన విజయ్‌కుమార్‌, శ్రావణికి ఏడాది క్రితం వివాహమవ్వగా.. ఇరువురు వైద్యపరీక్షల నిమిత్తం గురువారం సదాశివపేటకు తమ వాహనంలో వెళ్లారు. స్కానింగ్‌ ద్వారా శ్రావణి నాలుగు నెలల గర్భిణి అని తేలింది. అనంతరం ఇద్దరు తిరిగి స్వగ్రామానికి వస్తూ బుదేరా చౌరస్తాలోని తాజ్‌ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు ఆగారు. అదే సమయంలో గాలివాన ప్రారంభమవ్వగా.. ఇద్దరూ రెస్టారెంట్‌లోకి వెళుతుండగా గోడ కూలి శిథిలాలు వారిపై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన శ్రావణిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.


ఇవి కూడా చదవండి

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 04:31 AM