Share News

Sub Registrar Offices: సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల పునర్వ్యవస్థీకరణ

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:59 AM

రిజిస్ట్రేషన్‌ సేవలు మరింత సమర్థంగా, పారదర్శకంగా ఒకే చోట అందేలా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Sub Registrar Offices: సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల పునర్వ్యవస్థీకరణ

  • కార్పొరేట్‌ స్థాయిలో శాశ్వత భవనాల నిర్మాణం

  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్‌ సేవలు మరింత సమర్థంగా, పారదర్శకంగా ఒకే చోట అందేలా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్పొరేట్‌ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆఫీసులను నిర్మిస్తామని వెల్లడించారు. సచివాలయంలో శనివారం రెవెన్యూ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతుతో కలిసి శనివారం పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా 37 మాత్రమే సొంత భవనంలో ఉన్నాయని మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దశలవారీగా కొత్త కార్యాలయాలను నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో నాలుగు లేదా ఐదు కార్యాలయాలను ఒకే చోట నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను రెండు చోట్ల, రంగారెడ్డి జిల్లాలోని 14 ఆఫీసులను మూడు చోట్ల, మేడ్చల్‌ జిల్లాలోని 12 కార్యాలయాలను మూడు చోట్ల.. సంగారెడ్డి, పఠాన్‌చెరు కలిపి ఒక చోట ఇంటిగ్రేటెడ్‌ భవనాలను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ఇందుకు అవసరమైన భూమిని గుర్తించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడటమే కాకుండా పర్యవేక్షణ సులభమవుతుందని, అవినీతిని తగ్గించవచ్చని, కార్యాలయాల మధ్య పని భారం సమానంగా ఉండటంతో పాటు దస్త్రాల పరిశీలన వేగవంతం అవుతుందని వివరించారు. మొదటగా హైదరాబాద్‌లోని గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్‌ ల్యాండ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(తాలిమ్‌) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌గా నిర్మిస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించి ఈ భవన నమూనాకు తుది రూపునిస్తామని, వీలైనంత త్వరగా శంకుస్థాపన చేేసలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.


‘ఇందిరమ్మ ఇళ్ల’కు కేంద్రం కొర్రీలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరు చేసే ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రంపై ఆధారపడలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇళ్ల విషయంలో కేంద్రం అనేక కొర్రీలు వేస్తోందని ఆరోపించారు. శనివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాసయోజన (పీఎంఏవై) పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు రూ.72వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.52 లక్షలను మాత్రమే అందిస్తున్నదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలకు ఇస్తున్నదని అన్నారు. అందుకే కేంద్రం నుంచి అందే అరకొర సహాయంపై ఆధారపడకుండానే ప్రభుత్వం అనుకున్న విధంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే కేంద్రం సూచించిన విధంగా దరఖాస్తుదారుల విషయంలో రీ సర్వే కూడా చేపట్టామని, ఇది తుది దశలో ఉందన్నారు. అయితే లబ్ధిదారుల విషయంలో కేంద్ర నిబంధనల కంటే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే పకడ్బందీగా ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రం సహకరించకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఆగవవని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా సీఎం రేవంత్‌ ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో పురోగతిలో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, భూ భారతికి వచ్చిన దరఖాస్తుల్లో ప్రధానంగా సాదాబైనామాలకు సంబంధించినవే ఉన్నాయని, ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని.. కోర్టు తీర్పురాగానే పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచామన్నారు. కాగా తన పీఏ, డిప్యూటీ తహశీల్దార్‌ నవీన్‌రెడ్డి రచించిన తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు పుస్తకం ఐదో ఎడిషన్‌ను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 04:59 AM