Vehicle Registration: షోరూం వద్దే రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:01 AM
కొత్తగా వాహనం కొనుగోలు చేస్తున్నారా! అయితే రిజిస్ట్రేషన్ కోసం ఇకపై స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్లాట్ కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం అసలే లేదు.

వాహనాల డీలర్ల వద్ద ఆన్‌లైన్‌లో ప్రక్రియ
వాహనదారు ఇంటికే స్మార్ట్‌కార్డు.. రవాణా శాఖ నిర్ణయం
జనవరి నుంచి అమల్లోకి..దళారీ వ్యవస్థకు పడనున్న అడ్డుకట్ట
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కొత్తగా వాహనం కొనుగోలు చేస్తున్నారా! అయితే రిజిస్ట్రేషన్ కోసం ఇకపై స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్లాట్ కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం అసలే లేదు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని రవాణా శాఖ కల్పించబోతోంది. వాహన డీలర్ (షోరూం) వద్దనే అవసరమైన రుసుమును ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో చెల్లించి సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించనుంది. డీలర్ వద్ద రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం శాశ్వత రిజిస్ట్రేషన్ (పీఆర్) స్మార్ట్ కార్డు ప్రస్తుతం అందిస్తున్న తరహాలోనే.. పోస్టల్‌లో నేరుగా వాహనదారుడి ఇంటికి వస్తుంది. దీంతో.. రవాణా శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత, రోజురోజుకూ పెరుగుతున్న నూతన వాహనాల సంఖ్య నేపథ్యంలో అటు అధికారులు, సిబ్బందికి, ఇటు వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఫుల్‌స్టాప్ పడనుంది. అంతేకాదు.. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాల వద్ద కొనసాగుతున్న దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడనుంది. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే వాహనదారులకు సేవలు అందనున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా, తక్షణమే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే ఈ నూతన విధానం అమలుపై రవాణా శాఖ కసరత్తు పూర్తి చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు.
ఇటీవల జరిగిన కీలక సమావేశంలో వారు ఈ అంశంపై చర్చించారు. డీలర్ల వద్ద వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసి, అనుమతి కూడా పొందారు. ప్రతి రోజూ సుమారు 2500 వరకు ద్విచక్ర వాహనాలు, 600కు పైగా కార్లు, ఇతర వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. డీలర్లకే రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడం వల్ల వాహనదారులు రవాణా శాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడంతోపాటు అధికారులు, సిబ్బందికి పని ఒత్తిడి తగ్గుతుంది. వారు ఇతర సేవలపై ఎక్కువగా దృష్టి సారించి సత్వర సేవలు అందించే అవకాశం కలుగుతుంది. డీలర్ల వద్దే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు తెలంగాణలోనూ నూతన విధానం తెస్తున్నారు. దీంతో వాహనదారుల అసౌకర్యం, సిబ్బందిపై పనిభారం సహా అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని రవాణా శాఖ కీలక అధికారి ఒకరు అన్నారు. వాస్తవానికి రహదారి భద్రత చట్టంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఊరట కల్పించే అనేక అంశాలను పొందుపరిచింది. అందులో ఒకటి వాహనాలకు డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ చేయడం. ఇందుకు సంబంధించి 2016లోనే కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలకు లోబడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో నూతన విధానం అందుబాటులోకి వచ్చింది. త్వరలో తెలంగాణలోనూ ఈ విధానం అమల్లోకి రానుంది.