Nagarjuna Sagar: సాగర్ కుడి కాలువకు నీటి విడుదలపై వివాదం
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:43 AM
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతి లేకుండా, ప్రాజెక్టు నిర్వహణను పర్యవేక్షిస్తున్న తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వకుండా నాగార్జున సాగర్ కుడి కాల్వకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేసుకున్నారు.

కేఆర్‌ఎంబీకి తెలంగాణ అధికారుల లేఖ
సాగర్‌కు 1.21 లక్షల క్యూసెక్కుల వరద
నాగార్జునసాగర్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతి లేకుండా, ప్రాజెక్టు నిర్వహణను పర్యవేక్షిస్తున్న తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వకుండా నాగార్జున సాగర్ కుడి కాల్వకు ఏపీ అధికారులు నీటిని విడుదల చేసుకున్నారు. దీనిపై తెలంగాణ అధికారులు గురువారం కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. ఈ నీటి సంవత్సరంలో (ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు) కేఆర్‌ఎంబీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కుడి, ఎడమ కాల్వలకు నీటి వాటాలను కేటాయించలేదు. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయకట్టులో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసుకుంటున్నాయి. తెలంగాణ పరిధిలోని ఎడమ కాల్వకు ఈ నెల 4 నుంచి 11 వరకు పాలేరు జలాశయం నింపేందుకు 1.7 టీఎంసీలు విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి పాలేరు జలాశయం నింపటంతో పాటు, రైతుల నారుమళ్ల అవసరాల నిమిత్తం నీటి విడుదల కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి సమాచారం ఇచ్చిన అనంతరం ఎడమ కాల్వకు, జంటనగరాల తాగు నీటి అవసరాలకు ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నీటిని విడుదల చేసుకుంటోందని ప్రాజెక్టు ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లిఖార్జున్‌రావు తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం తెలంగాణ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే బుధవారం సాయంత్రం నుంచి 500 క్యూసెక్కులు విడుదల చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై గురువారం కేఆర్‌ఎంబీకి లేఖ రాసినట్లు తెలిపారు.
సాగర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో
సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక పెరిగింది. నీటిమట్టం గురువారం సాయంత్రానికి 576 అడుగులకు చేరింది. సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా 511 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 3,972 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం 6,283 క్యూసెక్కులు విడుదలవుతుండగా, ఎగువ నుంచి 1,21,400 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News