Textile Industry: టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:19 AM
టెక్స్‌టైల్ రంగం అభివృద్ధికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు.

తెలంగాణలో అపార అవకాశాలు
తైవాన్ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం
ఈ-గవర్నెన్స్‌లో ఎస్తోనియా సహకారం తీసుకుంటామని వెల్లడి
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): టెక్స్‌టైల్ రంగం అభివృద్ధికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను కోరారు. శుక్రవారం సచివాలయంలో తైవాన్ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) అధ్యక్షుడు జస్టిన్ వాంగ్ నేతృత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘స్వల్ప కాలంలోనే టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దీటుగా ఎదిగింది. రాష్ట్ర పారిశ్రామిక జీఎ్‌సవీఏ (రాష్ట్ర స్థూల విలువ జోడింపు) 2024-25లో రూ.2.77 లక్షల కోట్లుగా ఉంది.
ఇందులో టెక్స్‌టైల్ రంగం కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(కేఎంటీపీ) గేమ్ చేంజర్‌గా మారింది. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది’’ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. తైవాన్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే ‘తెలంగాణ - తైవాన్ మాన్యుఫాక్చరింగ్ జోన్’ పేరిట ప్రత్యేక టైక్స్‌టైల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తామన్నారు. కాగా, ఈ-గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా దేశ సహకారం తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో ఆ దేశ వాణిజ్య ప్రతినిధులు మంత్రిని కలిశారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా తమకు సాంకేతిక సహకారం అందించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News