Share News

Damodara Rajanarasimha: మెడికల్‌ సీట్లలో స్థానికులకే అవకాశం దక్కాలి

ABN , Publish Date - Jul 29 , 2025 | 03:52 AM

వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శనరెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు.

Damodara Rajanarasimha: మెడికల్‌ సీట్లలో స్థానికులకే అవకాశం దక్కాలి

  • సుప్రీం కోర్టులో ఆ దిశగా వాదనలు వినిపించండి

  • ఏజీకి వైద్య శాఖ మంత్రి దామోదర విజ్ఞప్తి

  • హైకోర్టు తీర్పును కొట్టేయాలని కోరనున్న సర్కారు

  • జీవో 33 సరైనదేనని వాదించేందుకు సన్నద్ధం

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శనరెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి మండలి సమావేశం జరుగుతుండగా ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో స్థానికత అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. దీనిపై ఆగస్టు 5న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని, ఈ అంశంపై తక్షణమే ఏజీతో మాట్లాడాలని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి దామోదరకు సూచించారు. దీంతో మంత్రి దామోదర, ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినా.. హైటెక్‌ సిటీలోని ఏజీ నివాసానికి వెళ్లారు. సుప్రీంకోర్టులో వాదనల కోసం అవసరమైతే సీనియర్‌ న్యాయవాదుల సహకారం తీసుకోవాలని ఏజీకి మంత్రి సూచించారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా, స్థానికులకే మెడికల్‌ సీట్లు దక్కేలా గతేడాది ప్రభుత్వం జీవో 33ను తీసుకొచ్చింది. తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు (9వ తరగతి 12 వరకు) చదివిన వారే వైద్య విద్య ప్రవేశాలకు అర్హులని ఆ జీవో పేర్కొంది.


తెలంగాణలో పది వరకు చదివి ఇంటర్‌ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులు.. రాష్ట్ర స్థానికత ఉండి, ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు తమను స్థానికులుగా పరిగణించకపోవడంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌సింగ్‌.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తామని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత రెండు మూడు సార్లు విచారణ జరిగినా, కేసు కొలిక్కి రాలేదు. తాజాగా ఈ ఏడాది కూడా హైకోర్టులో కొందరు విద్యార్థులు స్థానికతపై పిల్‌ వేశారు. వైద్య విద్య ప్రవేశాల్లో దరఖాస్తు చేసుకునేందుకు వారిని అనుమతించాలని హైకోర్టు సూచించింది. మరోవైపు సుప్రీంకోర్టులో కేసు వచ్చే నెల 5న మరోమారు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో గతేడాదిలా అనుమతించడం కుదరదని, జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, హైకోర్టులో కేసును కొట్టేయాలని సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదించబోతోంది.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 03:53 AM