ఇకపై ఐదేళ్ల పిల్లలకూ కాక్లియర్ సర్జరీ
ABN , Publish Date - Mar 14 , 2025 | 06:04 AM
చిన్నారులకు వినికిడి సమస్య నుంచి ఉపశమనం కలిగించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వయసు పరిమితిని ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద ఇంతకాలం పిల్లలకు మూడేళ్ల వయసు వరకే ఈ శస్త్రచికిత్స చేయించుకునే వెసులుబాటు ఉండగా, దానిని ఐదేళ్ల వయసు వరకు ప్రభుత్వం పెంచింది.

గతంలో మూడేళ్ల వరకే ఆరోగ్య శ్రీ కింద వెసులుబాటు
వయసు పరిమితిని పెంచిన ప్రభుత్వం
వినికిడి లోపంఉన్న చిన్నారులకువరం
హైదరాబాద్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): చిన్నారులకు వినికిడి సమస్య నుంచి ఉపశమనం కలిగించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వయసు పరిమితిని ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద ఇంతకాలం పిల్లలకు మూడేళ్ల వయసు వరకే ఈ శస్త్రచికిత్స చేయించుకునే వెసులుబాటు ఉండగా, దానిని ఐదేళ్ల వయసు వరకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఇవో కర్ణన్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఈ సర్జరీ వల్ల వినికిడి సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలగకపోయినా కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ సర్జరీకి ప్రైవేటులో సగటున రూ.6- 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఈఎన్‌టీ వైద్యులు చెబుతున్నా రు. పేదల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ శస్త్రచికిత్సను చిన్నారులకు ఐదేళ్ల వయసు వరకు ఆరోగ్యశ్రీ కింద చేసేలా సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఆస్పత్రుల సంఖ్యను పెంచనున్న సర్కారు
ఇప్పటిదాకా కోఠీలోని ఈఎన్‌టీ, గాంధీ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల మేరకు 2022 నుంచి ఇప్పటిదాకా మొత్తం ఈ 3ఆస్పత్రుల్లో ఈ సర్జరీలు 132 చేశారు. మరిన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ సర్జరీలను చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్స కావడంతో నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని భావించి ఇంతకాలం ప్రైవేటు ఈఎన్‌టీ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద ఈ సర్జరీలు చేసే అవకాశమివ్వలేదు. కాగా ప్రస్తుతం 3ప్రైౖవేటు బోధనాస్పత్రుల్లో ఈ శస్త్ర చికిత్సకు ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రైవేటు ఈఎన్‌టీ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆస్పత్రులుగా నమోదయ్యే వీలు కల్పించేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది విధానపరమైన నిర్ణయం కావడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత అందుకు అనుమతులు వచ్చే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి రూ.5.75 లక్షలు చెల్లిస్తున్నారు. ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసేందుకే ఈ ఖర్చు అవుతుందని ఈఎన్‌టీ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి ఒక చెవికి సర్జరీ చేసుకోవచ్చు.
ప్రైవేట్‌ను అనుమతించాలి.. ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి..
ఈఎన్‌టీ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ప్యానెల్‌లో అవకాశం కల్పించాలి. దాంతో నాణ్యమైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు మరింత అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రైవేటులో నిర్వహించే ఈ సర్జరీలపై ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే దుర్వినియోగయ్యే అవకాశం ఉండదు. జిల్లాకు ఒక అధికారిని నియమించి, పర్యవేక్షించాలి. వైరల్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా వినికిడి లోపం తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి వాటికి కాక్లియర్ సర్జరీతో మెరుగైన ఫలితం ఉంటుంది.
- డాక్టర్ చావా ఆంజనేయులు, ఎంఎస్, చీఫ్ ఈఎన్‌టీ సర్జన్, ఏషియన్ ఈఎన్‌టీ కేర్ ఆస్పత్రి, హైదరాబాద్