SC Gurukuls: ఎస్సీ గురుకులాల్లో సీసీ కెమెరాలు
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:28 AM
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. వసతి గృహాల్లో ఆహార కల్తీ, విద్యార్థుల భద్రత వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని 268 స్కూళ్లలో ఏర్పాటుకు నిర్ణయం
ఒక్కో పాఠశాలకు 20 నుంచి 30 వరకు ఏర్పాటు
ఆహార కల్తీ, విద్యార్థుల భద్రత తదితర సమస్యలకు చెక్
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. వసతి గృహాల్లో ఆహార కల్తీ, విద్యార్థుల భద్రత వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో గురుకులంలో అవసరాన్ని బట్టి అత్యాధునిక ఏఐ టెక్నాలజీ, హై రిజొల్యూషన్ కలిగిన 20 నుంచి 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలను లైవ్‌లో చూసేందుకు మాసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్‌లోని ఎస్సీ గురుకుల సొసైటీ కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. కెమెరాల ఫీడ్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ప్రిన్సిపాళ్లు, వార్డెన్లను అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
జోనల్ కేంద్రాలు, కలెక్టర్లకు కూడా యాక్సెస్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. నెల రోజుల్లో కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 268 పాఠశాలలు ఉన్నాయి. బాలికల గురుకులాల్లోని పురుష బోధన, బోధనేతర సిబ్బందిని ఇప్పటికే వాటి నుంచి బదిలీ చేశారు. బాలికల గదుల్లోకి వాచ్‌మెన్లు వెళ్తున్నారనే ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. రాత్రివేళల్లో విద్యార్థులు బయటకు వెళ్తున్నారన్న ఫిర్యాదులు అధికమయ్యాయి. మరోవైపు గురుకులాల్లో తరచుగా ఆహారం కల్తీ అవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హాస్టళ్ల కిచెన్, భోజనం చేసే ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడం, కాంట్రాక్టర్లు నాసిరకమైన వస్తువు లు, సరుకుల సరఫరా చేయడం వంటి సమస్యలకు సీసీ కెమెరాల ఏర్పాటుతో చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా తమ పిల్లలు సురక్షితమైన వాతావరణంలో ఉన్నారనే భరోసా తల్లిదండ్రులకు లభిస్తుంది.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..