Share News

పాతబస్తీ మెట్రో పనులకు ఊతం

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:02 AM

పాత బస్తీలో చేపట్టిన మెట్రో కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లలో రూ.125 కోట్లను విడుదల చేసింది.

పాతబస్తీ మెట్రో పనులకు ఊతం

  • రూ.125 కోట్లు విడుదల

  • పనులు, పరిహారానికి దోహదం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): పాత బస్తీలో చేపట్టిన మెట్రో కారిడార్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లలో రూ.125 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలకశాఖ సోమవారం ఉత్తర్వులు మంజూరు చేసింది. రెండో దశ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్‌ను చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, పనులకు మొత్తం రూ.2,741 కోట్లు కేటాయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం ఉంది. మిగతా నిధులు కేంద్రం, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి సేకరించనున్నారు.


అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.822 కోట్లను కారిడార్‌కు వెచ్చించాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.106.88 కోట్లను చెల్లించింది. కాగా, ఈ ఏడాది సవరించిన బడ్జెట్‌తో కలుపుకుని రూ.125 కోట్లను తాజాగా విడుదల చేసేందుకు అనుమతులిచ్చింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రూ.125 కోట్లు పాతబస్తీలో నివాసాలు కోల్పోతున్న బాధితులకు అందించే పరిహారంతో పాటు కూల్చివేతలు, ఇతర పనులకు దోహదపడుతాయని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Jun 17 , 2025 | 05:02 AM