Share News

టీ ఫైబర్‌ ఇక టీనెక్ట్స్‌:మంత్రి దుద్దిళ్ల

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:15 AM

తెలంగాణలో 33 జిల్లాల్లోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు తెలంగాణ ఫైబర్‌ నెట్‌ (టీ-ఫైబర్) ద్వారా సేవలు అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ సేవలు ‘‘టీ-నెక్స్ట్’’ పేరిట అందుబాటులో ఉంటాయని తెలిపారు

టీ ఫైబర్‌ ఇక టీనెక్ట్స్‌:మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి తెలంగాణ ఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలు కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. టీ ఫైబర్‌ ఇకపై టి-నెక్స్ట్‌ పేరుతో సేవలు అందిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌, బేగంపేటలో టీ నెక్స్ట్‌ నూతన కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేబుల్‌ అపరేటర్ల సహకారంతో ప్రతీ ఇంటికీ టీవీ చానెల్స్‌తోపాటు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటిదాకా రాష్ట్రంలోని 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీల్లో టీ ఫైబర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో మరో 7,187 పంచాయతీల్లో ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు టీఫైబర్‌ సేవలను అనుసంధానించారని, 2027 నాటికి ఈ సంఖ్యను 60 వేలు చేస్తామని ప్రకటించారు. టీ-నెక్స్ట్‌ కొత్త లోగోను, టీఫైబర్‌కు సంబంధించిన నూతన విజన్‌ డాక్యుమెంట్‌ను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అలాగే, తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మంత్రి శ్రీధర్‌ బాబు బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Apr 11 , 2025 | 05:16 AM