Mahesh Kumar Goud: కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ దోషి!
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:02 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్ల కోసం కక్కుర్తిపడి అధికారులను కాదని, అన్నీ తానై అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దోషి అని కాళేశ్వరం కమిషన్ తేల్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహే్‌షకుమార్‌గౌడ్ ఆరోపించారు.

రూ. 40 వేల కోట్ల ప్రాజెక్టును లక్ష కోట్లకు తీసుకెళ్లారు.. అన్నీ తానై అక్రమాలకు పాల్పడ్డారు
లక్షా 20 వేల కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోశారు
కేసీఆర్‌కు శిక్ష పడాల్నా.. వద్దా?
టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్
42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కదం తొక్కుదాం: మీనాక్షి నటరాజన్
జోగిపేట రూరల్/అల్లాదుర్గం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్ల కోసం కక్కుర్తిపడి అధికారులను కాదని, అన్నీ తానై అక్రమాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దోషి అని కాళేశ్వరం కమిషన్ తేల్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహే్‌షకుమార్‌గౌడ్ ఆరోపించారు. జనహిత పాదయాత్రలో భాగంగా రెండో రోజైన శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ పరిధి సంగుపేట శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. అలాగే జోగిపేటలోని నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి, దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిషతో కలిసి శ్రమదానం చేశారు. కళాశాల ఆవరణలో మొక్క నాటారు. కార్యకర్తల సమావేశంలో మహే్‌షకుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం నిర్మాణంపై గొప్పలు చెప్పుకొన్న పెద్దాయన ఇంజనీర్లు, అధికారులు చెప్పినా వినకుండా అన్నీ తానై వ్యవహరించి రూ.లక్షల కోట్లు వృథా చేశారన్నారు. కమీషన్ల కక్కుర్తితో ఆ ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించడంతో బీటలు వారిందన్నారు. ఒక్క పిల్లరు కూలితే ఏమవుతుందని మాజీమంత్రి తారాక రామారావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంట్లో ఒక్క పిల్లరు కూలితే.. ఆ ఇంట్లో ఉండగలమా? అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సిన ప్రదేశంలో కాకుండా కమీషన్ల కోసం మరో చోట కట్టి.. ప్రాజెక్టు వ్యయం రూ. 40 వేల కోట్ల నుంచి లక్షా 20 వేల కోట్లకు పెంచి ప్రజాధనాన్ని గోదావరి పాలు చేశారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తుందన్న ఉద్దేశంతోనే గత ఎన్నికల్లో ప్రజలు వారిని కాదని, కాంగ్రె్‌సకు పట్టం కట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై నియమించిన కమిషన్ అక్రమాల నిగ్గు తేల్చి కేసీఆర్‌ను బోనులో నిలబెట్టిందని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్‌కు శిక్ష పడకూడదా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ దేశం కోసం అహర్నిశలు పాటుపడుతూ, గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిందని ఆరోపించారు.
యువత రాజకీయాల్లోకి రావాలి: మీనాక్షి
విద్యార్థులు చదువులు పూర్తయిన తర్వాత ఉద్యోగాల కోసమే చూడకుండా రాజకీయాల్లోకి కూడా రావాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. జనహిత పాదయాత్రలో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కళాశాలలో టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్‌తో కలిసి శ్రమదానం చేసిన అనంతరం కళాశాల విద్యార్థినులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని, యువతులు రాజకీయాలపై ఆసక్తి చూపాలని ఉద్బోధించారు. మాతృభాషపైనే కాకుండా హిందీ, ఇంగ్లిష్ భాషలపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమాల్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, మాజీమంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News