Share News

Police Investigation: సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య!

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:14 AM

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గంజాయి కేసులో ముగ్గురు పట్టుబడటం.. స్థానికంగా రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని తేటతెల్లం చేసింది.

Police Investigation: సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య!

  • అతడి వేధింపులు తాళలేకే..

  • రెండేళ్ల క్రితం ఘటన

  • తాజాగా గంజాయి కేసు విచారణలో బయటపడ్డ ఉదంతం

మల్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గంజాయి కేసులో ముగ్గురు పట్టుబడటం.. స్థానికంగా రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని తేటతెల్లం చేసింది. జూదానికి, తాగుడుకు బానిసై.. ఇంట్లోని వస్తువులను తెగనమ్ముతూ తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న భర్త తీరు పట్ల విసిగిపోయిన భార్య.. సుపారీ ఇచ్చి అతడిని చంపించింది. నిందితులు శవాన్ని తగులబెట్టడంతో అది ఎవరిదనేది గుర్తించడం పోలీసులకు కష్టమైంది. తాజాగా గంజాయి కేసులో పట్టుబడిన ముగ్గురిని నాటి హత్య ఘటనలో నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు హతుడి భార్య, మరొకరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మల్యాల పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో డీఎస్పీ రఘుచందర్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని సాయిరాంనగర్‌ కాలనీకి చెందిన సిం గం నడిపి గంగాధర్‌(45)కు భార్య సంధ్య, ఇద్దరు కూతుళ్లున్నారు. గంగాధర్‌ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి భార్య సంధ్యను వేధిస్తుండేవాడు. పెద్ద కుమార్తె పెళ్లికి భర్తే అడ్డుపడటంతో రూ.10వేలు ఇస్తానని ఆశపెట్టి.. అతడిని శాంతింపజేసి వివాహం జరిపించిందామె. తర్వాత.. గంగాధర్‌, తరచూ కూతురు అత్తగారింటికి వెళ్లి అల్లుడితో గొడవ పడుతుండటంతో సంధ్య విసిగిపోయింది.


భర్తను చంపితే తప్ప ప్రశాంతంగా బతకలేమని భావించింది. తన నిర్ణయాన్ని భర్త అన్న కుమారుడైన సింగం గ్రాహిత్‌, అతడి తల్లి మమతకు తెలిపింది. రూ.40 వేలు ఇస్తే.. గంగాధర్‌ హత్య కోసం ముగ్గురిని తీసుకొస్తానని గ్రాహిత్‌ చెప్పాడు. ఆ మొత్తాన్ని ఆమె ఇవ్వడంతో అతడు మెట్‌పల్లికే చెందిన అబ్దుల్‌ అప్సర్‌, చెన్న నిఖిల్‌, పవన్‌తో మాట్లాడుకున్నాడు. 2023 మార్చి 12న అద్దె కారులో సంధ్య, గ్రాహిత్‌, అప్సర్‌, నిఖిల్‌ పవన్‌, మమత కలిసి గంగాధర్‌ను ఎక్కించుకొని కొండగట్టుకు వెళ్లారు. అక్కడ ఓ టేకు తోట సమీపంలోకి తీసుకెళ్లి మద్యం తాగించారు. అనంతరం గంగాధర్‌ మెడ చుట్టూ వైరు బిగించి ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం.. మృతదేహంపై అక్కడి చెత్తనంతా పోగేసి తగులబెట్టి వెళ్లిపోయారు. తర్వాత ఊర్లో.. గంగాధర్‌ గురించి ఎవరు అడిగినా తమను వదిలేసి వెళ్లిపోయాడని సంధ్య చెబుతుండేది. అప్పట్లోనే పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని కనుగొని కేసు నమోదు చేశారు. కాగా ఈనెల 17న పోలీసులు గంజాయి కేసులో గ్రాహిత్‌, అప్సర్‌, నిఖిల్‌ను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా నిందితుల ఫోన్లలో గంగాధర్‌ హత్య తాలూకు దృశ్యాలను గమనించారు. నిందితులను ప్రశ్నించడంతో తామే చంపామని వారు అంగీకరించారు. గ్రాహిత్‌, అప్సర్‌, నిఖిల్‌, పవన్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గురువారం హతుడు గంగాధర్‌ భార్య సంధ్యను అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. ఈ కేసులో ఆరో నిందితురాలు, గ్రాహిత్‌ తల్లి మమత గతంలోనే చనిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 05:14 AM