Share News

Savitribai Phule: మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

ABN , Publish Date - Jan 03 , 2025 | 03:03 AM

సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతిని (జనవరి 3వ తేదీ) మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Savitribai Phule: మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

  • ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ

  • సావిత్రిబాయు ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతిని (జనవరి 3వ తేదీ) మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రిబాయి ఫూలే ఆశయాల సాధనకు తమ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని ఆర్పించారని కొనియాడారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు.


సావిత్రీబాయి ఆశయాల సాధనకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం తెలిపారు. ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వీలుగా వారిలో నైపుణ్యాల వృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బీసీల సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసమే రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను పూర్తి చేశామన్నారు. మహిళలను విద్యావంతులను చేయడానికి సావిత్రిబాయి ఫూలె ఎంతో శ్రమించారని, ఆమె త్యాగానికి, కృషికి గుర్తింపుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా టీచర్లు సావిత్రి భాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఏటా ఘనంగా జరుపుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - Jan 03 , 2025 | 03:03 AM