Share News

Siddipet: 60 లక్షల బీమా.. హత్య

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:57 AM

బీమా డబ్బుల కోసం ఓ అల్లుడు దివ్యాంగురాలైన తన సొంత అత్తను హత్య చేయించాడు. అనంతరం దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడు.

Siddipet: 60 లక్షల బీమా.. హత్య

  • అత్త కోసం భారీగా బీమా.. ఆపై ఆమెను వాహనంతో ఢీకొట్టించి చంపించిన అల్లుడు

  • సిద్దిపేట జిల్లా పెద్ద మాసాన్‌పల్లిలో ఘటన

సిద్దిపేట క్రైం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): బీమా డబ్బుల కోసం ఓ అల్లుడు దివ్యాంగురాలైన తన సొంత అత్తను హత్య చేయించాడు. అనంతరం దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్‌పల్లిలో ఈ నెల 7న జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తొగుట మండలం పెద్ద మాసాన్‌పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్‌కు తాటికొండ రామమ్మ కుమార్తెతో వివాహం జరిగింది. పౌలీ్ట్రఫాం వ్యాపారంతో పాటు వ్యవసాయంలో సుమారు రూ.22 లక్షల వరకు వెంకటేశ్‌ నష్టపోయాడు. అప్పులు పెరగడం, వ్యాపారంలో నష్టం రావడంతో దివ్వాంగురాలైన తన అత్త పేరిట బీమా చేయించి, చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తే డబ్బులు వస్తాయని భావించాడు. పథకం ప్రకారం అత్త తాటికొండ రామమ్మ పేరిట పోస్టాఫీసులో సంవత్సరానికి రూ.755 కట్టి రూ.15 లక్షల బీమా, ఎస్‌బీఐలో సంవత్సరానికి రూ.2000 కట్టి నలభై లక్షల యాక్సిడెంట్‌ బీమా చేయించాడు. రైతు బీమాకు సంబంధించి రూ.5 లక్షలు వస్తాయని తన స్నేహితుడు కరుణాకర్‌ తండ్రి పేరిట ఉన్న 28 గుంటల భూమిని తన అత్త రామమ్మ పేరు మీద రాయించాడు.


అనంతరం ఆమెను చంపేందుకు తన స్నేహితుడు తాళ్ల కరుణాకర్‌ సాయం తీసుకున్నాడు. కరుణాకర్‌ అప్పటికే వెంకటేశ్‌ నుంచి రూ. 1లక్ష 30 వేలు అప్పు తీసుకొని ఉన్నాడు. తన అత్తను చంపేందుకు సహకరిస్తే తనకు ఇవ్వాల్సిన నగదును ఇచ్చే అవసరం లేదని కరుణాకర్‌కు వెంకటేశ్‌ చెప్పడంతో ఈ పనికి అతడు అంగీకరించాడు. బీమా డబ్బు చేతికి అందిన తర్వాత వారిద్దరూ సమానంగా పంచుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. పథకంలో భాగంగా ఈ నెల 7న వెంకటేశ్‌, కరుణాకర్‌కు ఫోన్‌ చేసి తన అత్తను పెద్దమాసాన్‌పల్లికి తీసుకువస్తున్నట్లు చెప్పాడు. వెంటనే కరుణాకర్‌ సిద్డిపేటలో రూ.2.500లు చెల్లించి కారు అద్దెకు తీసుకున్నాడు. కారు నంబర్‌ కనిపించకుండా దానికి టీఆర్‌ నంబర్‌ స్టిక్కర్‌ అతికించాడు. అనంతరం తుక్కాపూర్‌ వచ్చి వెంకటేశ్‌ కోసం వేచి చూశాడు. వెంకటేశ్‌ తన అత్త రామవ్వను వారి వ్యవసాయ భూమి వద్ద రోడ్డు పక్కన కూర్చోబెట్టి.. పొలంలోకి వెళ్లగా కరుణాకర్‌ కారుతో ఢీ కొట్టి ఆమెను చంపేశాడు. అనంతరం టీఆర్‌ స్టిక్కర్‌ తీసేసి సిద్దిపేటకు వెళ్లి కారు అప్పగించాడు. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తన అత్త రామమ్మ మృతి చెందిందని వెంకటేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 04:57 AM