Smita Sabharwal: ఆ రెండు వేల మందిపై చర్యలు తీసుకుంటారా
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:11 AM
ఐఏఎస్ స్మితా సబర్వాల్ గచ్చిబౌలి పోలీసుల నోటీసులకు స్పందిస్తూ, తాను సహకరించానని, అదే ఫొటోను 2000 మంది రీట్వీట్ చేసినప్పుడు వారిపై చర్యలు తీసుకోకపోతే, టార్గెట్ చేసినట్లే అవుతుందని అన్నారు. సమానత్వం పాటించాలని ఆమె స్పష్టం చేశారు

వారిని విచారించకుంటే నన్ను టార్గెట్ చేసినట్లే
పోలీసులకు సహకరించా: ఐఏఎస్ స్మితా సబర్వాల్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): తనకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేయడంపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్‌ఎ్‌సఎ్‌స) వంటి చట్టాలకు కట్టుబడిన వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించానని, తన స్టేట్‌మెంట్‌ను కూడా ఇచ్చానని ఎక్స్ వేదికగా ఆమె తెలిపారు. అయితే.. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కృత్రిమ మేధ(ఏఐ) ఫొటోను రెండు వేల మంది రీపోస్టు చేశారని, వారందరిపై ఇలాంటి చర్యలే తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఒకవేళ వారందరినీ విచారించకుంటే.. తనను టార్గెట్ చేసినట్లవుతుందని, సహజ న్యాయ సూత్రాలు, సమానత్వ విలువలను పాటించనట్లవుతుందని పేర్కొన్నారు.
కంచ గచ్చిబౌలిలోని భూమిలో రాక్ దగ్గర గిబ్లీ ఇమేజ్‌తో జింకలు, నెమళ్లు ఉన్న ఏఐ ఫొటోను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. స్మితా సబర్వాల్ ట్వీట్‌పై ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్‌వో అయోధ్యరెడ్డి స్పందించారు. ఐఏఎస్ అధికారిణి(స్మితా సబర్వాల్) దృష్టి కోణంలో మార్పు ఎందుకొచ్చిందని, అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారొచ్చా అని ప్రశ్నించారు. అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించి, వన్యప్రాణులను తరిమిన(సీఎంవోలో ఇరిగేషన్ బాధ్యతలు నిర్వహించిన) వీరే.. ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏమిటని అని అన్నారు.