Share News

Minister Sridhar Babu: ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం

ABN , Publish Date - May 14 , 2025 | 03:56 AM

ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ’ నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు.

 Minister Sridhar Babu: ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం

  • అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్‌ సిటీ: దుద్దిళ్ల

హైదరాబాద్‌, కందుకూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ మార్గ నిర్దేశంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ నిర్మాణ పనుల పురోగతిని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి... పనులు సకాలంలో పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీ’ని ఏర్పాటు చేశామని వివరించారు. తొలిదశలో భాగంగా మీర్‌ఖాన్‌పేట్‌లోని స్కిల్స్‌ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌లో అకడమిక్‌ బ్లాక్‌, ప్రయోగశాలలు, వసతి గృహాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటిని ఈ ఏడాది డిసెంబరు 9న లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏడాది వ్యవధిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు. భావితరాల అవసరాల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో నాలుగో నగరంగా ‘ఫ్యూచర్‌ సిటీ’ని అభివృద్థి చేస్తామన్నారు. త్వరలోనే ఫ్యూచర్‌ సిటీ అథారిటీ కార్యాలయాన్ని స్థానికంగా ప్రారంభిస్తామన్నారు.

Updated Date - May 14 , 2025 | 03:57 AM