Mangli: ప్రముఖ గాయని మంగ్లీపై కేసు!
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:35 AM
ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా చేవెళ్లలోని ఓ రిసార్ట్‌లో మంగ్లీ బర్త్‌డే వేడుకలపై ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు.

చేవెళ్లలోని ఓ రిసార్ట్‌లో పుట్టిన రోజు వేడుకలు
అనుమతిలేని పార్టీలో పలువురు సినీ ప్రముఖులు
రిసార్టుపై అర్ధరాత్రి పోలీసుల దాడులు
అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు
ఓ వ్యక్తి శరీరంలో గంజాయి ఆనవాళ్లు
మంగ్లీ సహా నలుగురిపై కేసు నమోదు
చేవెళ్ల, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా చేవెళ్లలోని ఓ రిసార్ట్‌లో మంగ్లీ బర్త్‌డే వేడుకలపై ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులూ లేకుండా పుట్టిన రోజు పార్టీ నిర్వహించడం, మద్యం సరఫరా చేయడం, గంజాయి సేవించిన వ్యక్తి పట్టుబడడంతో మంగ్లీ సహా నలుగురిపై కేసు పెట్టారు. సీఐ భూపాల్ శ్రీధర్ కేసు వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి మంగళవారం రాత్రి తన బర్త్‌డే వేడుకలు జరుపుకొన్నారు. ఈ పార్టీకి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన 22 మంది హాజరయ్యారు. అయితే అర్ధరాత్రి వేళ పెద్ద పెద్ద శబ్దాలతో పార్టీ చేసుకుంటున్నారనే సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు సుమారు 12:45 గంటలకు చేవెళ్ల పోలీసులతో కలిసి త్రిపుర రిసార్ట్‌పై దాడులు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, మద్యానికి కూడా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు లేవని గుర్తించారు.
దీంతో అక్కడ ఉన్న 22 మందిలో 9 మంది అనుమానితులకు పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో దామోదర్‌రెడ్డికి పాజిటివ్‌గా వచ్చింది. తాను మూడు రోజుల కిందట గంజాయి తీసుకున్నానని, ఈ పార్టీలో కాదని అతను పోలీసులకు తెలిపాడు. తనకు గంజాయి సరఫరా చేసిన వారి సమాచారం కూడా ఇచ్చాడు. దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. పార్టీ వ్యవహారానికి సంబంధించి నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గాయని మంగ్లీతోపాటు ఆమె మేనేజర్ దున్న మేఘరాజ్, అతని స్నేహితుడు దామోదర్‌రెడ్డి(గంజాయి సేవించిన వ్యక్తి), త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణలపై కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఆరు ఖాళీ మద్యం సీసాలతోపాటు నాలుగు ఫుల్ బాటిళ్లు లభ్యమయ్యాయి. దీంతోపాటు డీజే సౌండ్ బాక్స్‌లను సీజ్ చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యం బాటిళ్లు దొరికాయన్న ప్రచారం జరగ్గా.. అలాంటిదేమీ లేదని పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్‌డీపీఎస్, శబ్దకాలుష్య చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
పుట్టిన రోజు నాడే కేసు..
పుట్టిన రోజు నాడే సింగర్ మంగ్లీపై కేసు నమోదవడం గమనార్హం. రిసార్ట్‌లో విపరీతమైన శబ్ద కాలుష్యంతో పార్టీ నిర్వహించారు. పార్టీకి వచ్చిన స్నేహితులకు మంగ్లీ మద్యం సరఫరా చేయించారు. డ్రగ్స్ పరీక్షల సమయంలో మంగ్లీ స్నేహితురాలు దివి పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. పోలీసులు వీడియో తీస్తుండగా అడ్డుపడడంతో.. ‘మా పని చేయకుండా అడ్డుపడితే మీకే నష్టం’ అని పోలీసులు హెచ్చరించారు. ఈ పార్టీలో మంగ్లీ కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితులతోపాటు సింగర్ ఇంద్రావతి, దివి, సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్, రచ్చ రవి కూడా ఉన్నట్లు సమాచారం. అయితే పోలీసుల దాడి సమయంలో తాను అక్కడ లేనని కాసర్ల శ్యామ్ ప్రకటించారు.