Share News

Singer Mangli: మంగ్లీ ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు ప్రస్తావించిన పోలీసులు

ABN , Publish Date - Jun 11 , 2025 | 06:36 PM

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Singer Mangli: మంగ్లీ ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు ప్రస్తావించిన పోలీసులు
Singer Mangli and Big Boss Fame Divi

హైదరాబాద్, జూన్ 11: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు అయింది. అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించిన కారణంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. మంగళవారం అంటే.. జూన్ 10వ తేదీ అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో చేవెళ్ల మండలం ఈర్లపల్లి శివారులోని త్రిపుర రిసార్ట్‌‌పై తమకు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. రిసార్ట్‌లో పెద్దఎత్తున డీజే సౌండ్స్ పెట్టి హంగామా చేస్తున్నారని కంట్రోల్ రూమ్‌కి స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


స్థానికుల ఫిర్యాదుతో త్రిపుర రిసార్ట్‌కి మహిళా ఎస్సై వెళ్లారని చెప్పారు. అక్కడ పది మంది మహిళలతోపాటు 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించామని వివరించారు. వాళ్లంతా మద్యం మత్తులో డాన్సులు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మంగ్లీ బర్త్‌ డే పార్టీ జరుగుతున్నట్లు అక్కడే ఉన్న మేనేజర్ తెలిపారని చెప్పారు. అయితే ఆమె బర్త్‌డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ స్పష్టం చేశారని వివరించారు.


ఇక మంగ్లీ బర్త్‌ డే పార్టీలో పెద్దఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అలాగే ఎక్సైజ్ అధికారుల నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా లేదని ఈ సందర్బంగా గుర్తించామన్నారు. ఆ క్రమంలో బర్త్‌ డే పార్టీ చేసుకుంటున్న మంగ్లీని విచారించామని చెప్పారు. బర్త్‌డే పార్టీకి, లిక్కర్ వినియోగానికి, డీజేకి అనుమతి లేదని మంగ్లీ స్పష్టం చేశారని పోలీసులు వివరించారు. డీజే ఈవెంట్ మేనేజర్‌ గా మేఘరాజు పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు.


మరోవైపు పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. డ్రగ్ కిట్ ద్వారా అందరికీ పరీక్షలు నిర్వహిస్తే.. ఒక్కరికి మాత్రమే గంజాయి తీసుకున్నట్లు తేలిందన్నారు. మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లు ఈ పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు. ఈ నేపథ్యంలో దామోదర్ రెడ్డిని అరెస్టు చేసి విచారించామన్నారు.


ఇక ఈ పార్టీలో పెద్దఎత్తున విదేశీ మద్యాన్ని గుర్తించామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. పోలీసులు, ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీపైనా కేసు నమోదు చేశామని చెప్పారు. ఎలాంటి అనుమతులూ లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్ మేనేజర్ దామోదర్‌పై సైతం కేసు పెట్టామని ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్‌పైనా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు.


నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను..

మంగ్లీ పార్టీ వివాదంపై బిగ్ బాస్ దివి ఆడియో విడుదల చేశారు. ఫ్రెండ్ పార్టీ అని వెళ్లానని ఆమె స్పష్టం చేశారు. అక్కడ ఏం జరుగుతుందనేది తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియాలో తన ఫొటోలు వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు దివి. ఇది తన కెరీర్‌కు ఎంతో ఇబ్బందని, తాను కష్టపడి ఈ స్దాయికి వచ్చానని వివరించారు. ఫ్రెండ్ పిలిస్తే ఎవరైనా పార్టీకి వెళతారన్నారు దివి. దయచేసి తన ఫొటోలు వాడవద్జంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు

ఎమ్మెల్యే కోసం యువకులు వీరంగం.. ఎందుకంటే..

For Telangana News and Telugu News

Updated Date - Jun 16 , 2025 | 12:52 PM