Singareni: మజ్దూర్లకు జనరల్ అసిస్టెంట్లుగా గుర్తింపు
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:06 AM
సింగరేణి సంస్థలో క్యాటగిరి - 1 మజ్దూర్లను జనరల్ అసిస్టెంట్లుగా గుర్తించాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల 14,000 మంది మజ్దూర్లకు గౌరవం కల్పించడం జరిగింది.

సింగరేణి భవన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థలో క్యాటగిరి - 1 లో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్లకు జనరల్ అసిస్టెంట్లుగా గుర్తింపు వచ్చింది. ఈ మేరకు బుధవారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన జాతీయస్థాయి వేజ్ బోర్డు ఒప్పందంలో భాగంగా ఈ పేరు మార్పునకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం ఆదేశించడంతో సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న 14 వేల మంది జనరల్ మజ్దూర్లతో పాటు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మజ్దూర్ అంటే హిందీలో కార్మికుడు, కూలి అని అర్థం. వీరి వృత్తికి సముచిత గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో జనరల్ మజ్దూర్ అనే పేరును తొలగించి జనరల్ అసిస్టెంట్‌గా పేరు మార్పు చేశారు.