Singareni: కాలుష్య కోరల్లో ఓసీపీ బాధిత గ్రామాలు
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:59 AM
బొగ్గు గనులతో సింగరేణికి సిరుల పంట పండుతున్నా.. ఓపెన్‌కాస్టు తవ్వకాల వల్ల సమీప గ్రామాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.

ఆస్తమా, అలర్జీలతో సతమతమవుతున్న ప్రజలు.. దుమ్ము, ధూళితో పంటలూ పండించలేని వైనం
సింగరేణి పరిహారం ఇస్తే.. ఊళ్లు ఇచ్చేస్తామంటున్న బాధితులు
మంత్రుల సమీక్ష తర్వాత వారి ఆశలకు కొత్త ఊపిరి
సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఆదేశించడంతో ఊరట
భూపాలపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బొగ్గు గనులతో సింగరేణికి సిరుల పంట పండుతున్నా.. ఓపెన్‌కాస్టు తవ్వకాల వల్ల సమీప గ్రామాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. గనుల ఏర్పాటుతో తమ భూములకు ధరలు పెరిగి మహర్దశ పడుతుందని ఆశ పడిన స్థానికులకు.. సింగరేణి ఓసీపీల పుణ్యమా అని ఆస్తమా, అలర్జీ వంటి వ్యాధులే ఫలంగా మిగులుతున్నాయి. తవ్వకాలతో వెలువడుతున్న దుమ్ము కారణంగా అటు పంటలు పండక, ఇటు ఊర్లలో ఉండలేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఊళ్లను వదిలేయాలనే నిర్ణయానికొచ్చిన బాధిత గ్రామాల ప్రజలు.. తగిన పరిహారమిచ్చి తమ ఇళ్లు, భూములను తీసుకోవాలని సింగరేణిని కోరుతున్నారు. భూపాలపల్లి ప్రాంతంలోని ఓపెన్‌కాస్టు-3 (మాధవరావుపల్లి ఉపరితల గని) పరిసరాల్లో ఉన్న కొండంపల్లి, పరుశురాంపల్లి, ధర్మరావుపేట, నగరంపల్లి, కొండాపూర్, వెంకటేశ్వర్లపల్లి, గుర్రంపేట ఎస్సీ కాలనీ తీవ్రంగా ప్రభావిత మవుతున్నాయి. బొగ్గు తవ్వకాల కోసం జరిపే పేలుళ్ల తీవ్రతకు ఆయా ప్రాంతాల్లోని ఇళ్లన్నీ కంపించిపోవడంతోపాటు గోడలు బీటలు వారుతున్నాయి. బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్(మట్టి) తరలింపు సమయంలో రేగుతున్న దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. పేలుళ్ల తీవ్రతనైనా తగ్గించండి లేదా పరిహారం ఇచ్చి తమ ఇళ్లను సేకరించండి అంటూ బాధిత గ్రామాల ప్రజలు పదేళ్లుగా సింగరేణిపై ఒత్తిడి తెస్తున్నా.. పెద్దగా ఫలితం దక్కలేదు. ఓపెన్ కాస్టు-1 పరిధిలో కొంత భూ సేకరణ జరిపినా.. ఇంకా 125 ఎకరాల మేర సేకరించి, పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇక, భూపాలపల్లి పట్టణ సమీపంలో ఉన్న ఓపెన్ కాస్టు-2 కారణంగా శాంతినగర్, హనుమాన్ నగర్, గాంధీనగర్, ఫక్కీర్ గడ్డ, ఆకుదారివాడ, జంగేడు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి పరిహారం చెల్లించలేదు.
దుమ్ములో ప్రమాదకర సూక్ష్మ కణాలు
ఓసీపీల వల్ల పీఎం(పర్టిక్యులేట్ మ్యాటర్) 10, పీఎం 2.5గా పిలవబడే అతి సూక్ష్మ కణాలు గాలిలో కలిసి మనుషులు, జంతువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పీఎం 2.5 సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులు, రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయి ముక్కు, గొంతు, కంటి ఎలర్జీ, దగ్గు, దమ్ము, గురక వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా రక్తంలోకి చొచ్చుకుపోవడం వల్ల ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు అకాల మరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నేళ్లుగా సింగరేణి సంస్థ వైద్య శిబిరాలు నిర్వహించిన దాఖలాలు కూడా లేవు. ఓసీపీ-3 వల్ల పంటలు కూడా సాగు చేయలేని పరిస్థితి నెలకొందంటూ పలు గ్రామాల రైతులు ఇటీవల సింగరేణి కార్యాలయాలు, బొగ్గు గనుల పరిసరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
మంత్రుల దృష్టికి సమస్య
ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇటీవల డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లడంతో మరో సారి తెరపైకి వచ్చింది. బాధిత గ్రామాల ప్రజల సమస్యలు విన్న మంత్రులు.. శాశ్వత పరిష్కారం చూపుతామంటూ అక్కడిక్కడే హామీ ఇచ్చారు. అంతేకాదు అదే రోజు సాయంత్రం సింగరేణి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభావిత గ్రామాల్లో రెవెన్యూ అధికారులతో కలిసి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయడంతోపాటు వెంటనే తమకు నివేదిక పంపాలని వారు ఆదేశించారు. పునరావాసం సాధ్యాసాధ్యాలపై అంచనాలు రూపొందించాలని సూచించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమకు ఇచ్చే పరిహారాన్ని(అవార్డును) తేల్చాలని, వెంటనే పునరావాసం కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఓసీపీతో ఇబ్బందులు పడుతున్నాం
ఓసీపీతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న భూములను కోల్పోయి దుమ్ము, ధూళితో సతమతమవుతున్నాం. పేలుళ్ల తీవ్రతతో మా ఇళ్లు బీటలు వారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పరిహారం అందించి మా గ్రామాన్ని ఇక్కడ నుంచి తరలించాలి.
- ఉడుత రవీందర్, పరుశురాంపల్లి
Also Read:
కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
For More Telangana News And Telugu News