Share News

Nizamabad Ex MLA Arrest: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్టు

ABN , Publish Date - Apr 11 , 2025 | 03:51 AM

నిజామాబాద్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తల్లి మరణవార్త తెలుసుకున్న షకీల్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని శంషాబాద్‌లో అరెస్టయ్యారు

Nizamabad Ex MLA Arrest: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అరెస్టు

  • దుబాయ్‌ నుంచి రాగానే ఎయిర్‌పోర్టులో అదుపులోకి

  • తల్లి అంత్యక్రియలకు హాజరు కావడానికి అనుమతి

  • మళ్లీ విచారణకు పిలిస్తే రావాలని.. లేదంటే అరెస్టు తప్పదని హెచ్చరిక

  • కుమారుడి రాష్‌ డ్రైవింగ్‌ కేసుల్లో నిందితుడిగా షకీల్‌

బోధన్‌ రూరల్‌, పంజాగుట్ట, శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): పలు కేసుల్లో తప్పించుకునేందుకు దుబాయ్‌ పారిపోయిన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షకీల్‌ తల్లి షగుప్తా అదీప్‌(80) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. తల్లి మరణవార్త తెలుసుకున్న షకీల్‌.. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనపై లుకౌట్‌ నోటీసు జారీ అవ్వడంతో.. పోలీసులు శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతని పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు. తల్లి అంత్యకియ్రలు ఉన్నందున.. సొంత పూచీకత్తుపై విడుదల చేస్తూ.. విచారణకు పిలిచినప్పుడు రాకుంటే అరెస్టు తప్పదని హెచ్చరించారు. ఆ వెంటనే షకీల్‌ కుటుంబం బోధన్‌ చేరుకుంది.


తన తల్లి పార్థివ దేహాన్ని చూసిన షకీల్‌.. కన్నీరుమున్నీరయ్యారు. ఆయనను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేతలు అక్కడికి చేరుకున్నారు. బోధన్‌లోని జామియా మసీదులో ప్రత్యేక ప్రార్థనల తర్వాత.. అదీప్‌ మృతదేహాన్ని అలీసానగర్‌ శ్మశానవాటికలో ఖననం చేశారు. కాగా.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో షకీల్‌ కుమారుడు రాహెల్‌ నిర్లక్ష్య డ్రైవింగ్‌ చేసి, ఒకరి మృతికి కారకుడయ్యారు. మరో రోడ్డు ప్రమాదంలోనూ ఆయనపై కేసులున్నాయి. ప్రగతిభవన్‌ కేసులో.. కుమారుడిని తప్పించేందుకు షకీల్‌ ప్రయత్నించారు. రాహెల్‌ను దుబాయ్‌కి పంపారు. దీంతో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో షకీల్‌ ఏ-3 అయ్యారు. ఇదే కేసులో పలువురు పోలీసులు కూడా సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే..! అసెంబ్లీ ఎన్నికల తర్వాత షకీల్‌ దుబాయ్‌కి పారిపోగా.. పోలీసులు తొలుత లుకౌట్‌ నోటీసు జారీ చేశారు.

Updated Date - Apr 11 , 2025 | 03:51 AM