Srisailam: మట్టిని తవ్వేందుకు టన్నెల్‌లోకి రోబో
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:34 AM
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకోగా ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది.

గంటకు వెయ్యి క్యూబిక్ మీటర్ల తరలింపు!
మట్టి, బురద కన్వేయర్ బెల్టుపైకి.. బండరాళ్లు వచ్చినా తవ్వేస్తుంది
రోబోటిక్స్ అసోసియేషన్ పర్యవేక్షణ
డీ1 వద్ద మెటల్ ప్లేట్ కటింగ్
మహబూబ్‌నగర్/దోమలపెంట, మార్చి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకోగా ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. మిగతా ఏడుగురి కోసం అన్వేషణ సాగుతోంది. క్యాడవర్ జాగిలాలు, జీపీఆర్ ఆధారంగా గుర్తించిన రెండు ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. వాసన వస్తున్నట్లు చెబుతున్న డీ1 ప్రాంతం షీర్ జోన్‌లో ఉండడంతో దాదాపు 20 మీటర్ల మేర తవ్వకాలకు రోబోలను వినియోగించాలని నిర్ణయించారు. ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మదర్ రోబోను తీసుకొచ్చి కమ్యూనికేషన్, నావిగేషన్ సిద్ధం చేయగా బుధవారం ‘అటానమస్ స్లడ్జ్ రిమూవల్ రోబో’ను టన్నెల్ లోపలికి పంపించారు. ఇందులోని హైడ్రాలిక్ సిస్టం బండలను పగులగొడుతుంది. ముందు ఉన్న గ్రైండర్ లాంటిది మట్టిదిబ్బలను వదులుగా చేస్తుంది. 40 హెచ్‌పీ సామర్థ్యంతో 10 అంగుళాల పైపు ద్వారా మట్టి, బురదను పీల్చుకొని పైప్ ద్వారా కన్వేయర్ బెల్టుపై వేస్తుంది. దీనివల్ల డేంజర్ జోన్‌లో కూడా పని సులభం కానుంది. గంటకు వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించడం ఈ రోబో ప్రత్యేకత. దీనికి అవసరమైన రెండు చిన్న సైజ్ సూపర్ సక్కర్‌లను అన్వి రోబోటిక్స్, జాన్వి టెక్నాలజీస్ ఆధ్వర్యంలో తయారుచేసి తీసుకురానున్నారు. పూణే నుంచి మరో రెండు రోబోలను కూడా రపించనున్నారు. డీ1 ప్రాంతంలో టీబీఎం ఐరన్ షీట్‌ను కత్తిరిస్తున్నారు. దానికింద ఉన్న ఖాళీ స్థలంలో మిగిలిన కార్మికుల ఆచూకీ దొరకవచ్చని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. సహాయక చర్యలను స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, నాగర్‌కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్ పర్యవేక్షిస్తున్నారు.
స్వగ్రామంలో గురుప్రీత్ సింగ్ అంత్యక్రియలు
నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో మృతిచెందిన అమెరికా రాబిన్స్ కంపెనీకి చెందిన టన్నెల్ బోరు మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామం పంజాబ్ రాష్ట్రంలోని తర్ను తరన్ జిల్లా చీమకలాన్‌లో పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఆర్‌ఐ వెంకటేశ్వర్లు.. మృతుడి భార్యకు అందజేశారు. పంజాబ్ ప్రభుత్వం కూడా రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి చెక్కు అందజేసింది.