Award: సిరిపట్టు పితాంబరం చీరకు అరుదైన గౌరవం
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:09 AM
రాజన్న సిరిపట్టు పితాంబరం చీరకు అరుదైన గౌరవం దక్కింది. ఈ చీరను నేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారిణి వెల్ది రేఖ రాష్ట్రస్థాయిలో అందించే ప్రతిష్ఠాత్మక కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు.

చేనేత కళాకారిణి రేఖకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు
సిరిసిల్ల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిపట్టు పితాంబరం చీరకు అరుదైన గౌరవం దక్కింది. ఈ చీరను నేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారిణి వెల్ది రేఖ రాష్ట్రస్థాయిలో అందించే ప్రతిష్ఠాత్మక కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈమేరకు శుక్రవారం చేనేత జౌళి శాఖ ప్రకటన చేసింది. ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా అందించే ఈ అవార్డుకు ఎంపికైన తొలి మహిళా చేనేత కార్మికురాలు రేఖ కావడం విశేషం. ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సతీమణి రేఖ.
ఈమె 45 రోజులపాటు శ్రమించి చేనేత మగ్గంపై రూపొందించిన సిరిపట్టు పితాంబరం చీరను అధికారులు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపిక చేశారు. రూ.36వేల విలువైన ఈ చీర 48 అంగుళాల వెడల్పు, ఐదు మీటర్ల పొడవు, 605 గ్రాముల బరువు ఉంది. ఈ పట్టు చీరలో కాకతీయుల శౌర్యానికి గుర్తుగా ఉన్న కమాన్‌తో పాటు వేములవాడ రాజన్న కోడె మొక్కులను సూచించే జరీబుటాలను పొందుపరిచారు.