Share News

Betting Apps Case: ఈడీ ముందుకు ప్రకాశ్‌రాజ్‌

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:52 AM

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసుకు సంబంధించి సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు తన

Betting Apps Case: ఈడీ ముందుకు ప్రకాశ్‌రాజ్‌

  • బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో 5 గంటలు విచారణ

  • రూపాయి తీసుకోకుండా ప్రమోషన్‌ చేసా!

  • బాధ్యత గల పౌరుడిగా విచారణకు వచ్చా..

  • ఇకపై ప్రమోషన్‌ చేయను ప్రకాశ్‌రాజ్‌

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసుకు సంబంధించి సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు తన న్యాయవాదితో కలిసి బుధవారం విచారణకు హాజరయ్యారు. ఆయన్ను ఈడీ అధికారులు దాదాపు ఐదు గంటలు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. 2016లో ప్రకాశ్‌రాజ్‌ జంగిల్‌ రమ్మీ అనే యాప్‌కు ప్రమోషన్‌ చేసిన నేపథ్యంలో.. అందుకు ఎంత పారితోషికం తీసుకున్నారు? నగదు రూపంలోనా.. ఆన్‌లైన్‌లోనా? అని ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ప్రకాశ్‌రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. జంగిల్‌ రమ్మీ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తనకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. వారు డబ్బు ఇస్తానని చెప్పినా తాను తీసుకోలేదని పేర్కొన్నారు. జంగిల్‌ రమ్మీ యాప్‌ యాజమాన్యానికి తనకు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని ఆయన తెలిపారు. డబ్బు తీసుకోకుండా జంగిల్‌ రమ్మీ ప్రమోషన్‌ ఎందుకు చేశారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. బాధ్యత గల పౌరుడిగా ఈడీ అధికారుల నోటీసు ప్రకారం విచారణకు హాజరయ్యానని, వారు అడిగిన సమాచారం ఇచ్చానని, తనను మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు కోరలేదని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో మనీలాండరింగ్‌ కోణంలో విచారణ జరుపుతున్న ఈడీ అధికారుల ముందుకు వచ్చే నెల 11వ తేదీన విజయ్‌ దేవరకొండ, దగ్గుబాటి రాణా రానున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోషన్‌ చేసిన సెలబ్రిటీలకు దుబాయ్‌ రూట్‌లో హవాలా మార్గంలో డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు, యూట్యూబర్లు బెట్టింగ్‌ యాప్‌లను తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ప్రమోట్‌ చేసి భారీగా ఆదాయాన్ని సంపాదించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని ఈడీ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 04:52 AM