Ponnam Prabhakar: తెలంగాణకు సరిపడా ఎరువులు ఇవ్వని కేంద్రం
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:24 AM
ఎరువుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను దాచిపెడుతోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంపై వివక్షతో ఇబ్బందులకు గురి చేస్తోంది: పొన్నం
అక్కన్నపేట, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఎరువుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను దాచిపెడుతోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని వేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, స్టీల్ బ్యాంకు, కాటమయ్య రక్షణ కవచాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు.
అయినా కేంద్రం రాష్ట్రానికి సరిపడా ఎరువులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రామచందర్‌రావు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి రాష్ట్రానికి సరిపడా ఎరువులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎ్‌స)లో నిర్వహించిన కార్యక్రమంలోనూ ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు ఇచ్చిన 21 రకాల స్టీల్ వస్తువులను వాడుకోవాలని సూచించారు. ఇకపై ఫంక్షన్లలో ప్లాస్టిక్ వాడితే అధికారులు రూపాయి జరిమానా విధిస్తారని చెప్పారు.