Share News

Robotic: నీటి రక్షణకు కుట్టి రోబోలు

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:51 AM

నీటి వనరుల నిర్వహణ అంశంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య లీకేజీ.. కిలోమీటర్ల మేర భూగర్భంలో విస్తరించి ఉండే పైపులైన్లలో నీళ్లు ఎక్కడ లీకవుతున్నాయి ? అనేది గుర్తించడం, మరమ్మతులు నిర్వహించడం చాలా పెద్ద పని.

Robotic: నీటి రక్షణకు కుట్టి రోబోలు

  • పైప్‌లైన్‌లోకి వెళ్లి లీకేజీని గుర్తించి మరమ్మతు చేసే ‘పైప్‌బాట్స్‌’

  • యూకే ఇంజనీర్ల అద్భుత ఆవిష్కరణ

లండన్‌, జూన్‌ 20 : నీటి వనరుల నిర్వహణ అంశంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య లీకేజీ.. కిలోమీటర్ల మేర భూగర్భంలో విస్తరించి ఉండే పైపులైన్లలో నీళ్లు ఎక్కడ లీకవుతున్నాయి ? అనేది గుర్తించడం, మరమ్మతులు నిర్వహించడం చాలా పెద్ద పని. ఈ పని కోసం పెద్ద ఎత్తున మానవ వనరులతోపాటు యంత్రాలను వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు రహదారులను మూసేసి అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాల్సి వస్తుంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ పనులు పూర్తవ్వడానికి ఒక్కోసారి రోజులు, వారాలు కూడా పడతాయి. ఈ క్రమంలో వేల లీటర్ల నీళ్లు వృథా అవుతుంటాయి. పోనీ ఇంత శ్రమించినా సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందా ? అంటే గ్యారంటీ లేదు. వీటన్నింటికీ చెక్‌ పెట్టేలా.. లీకేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా.. ఇంగ్లండ్‌లోని ఫెఫీల్డ్‌ విశ్వవిద్యాలయం మెకానికల్‌, ఏరోస్పేస్‌, సివిల్‌ ఇంజనీర్లు బర్మింగ్‌హమ్‌, బ్రిస్టల్‌, లీడ్స్‌ విశ్వవిద్యాలయల పరిశోధకులతో కలిసి అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.


రజనీకాంత్‌ నటించిన రోబో 2.0 సినిమాలో చిట్టి సృష్టించిన ‘కుట్టి’ మాదిరిగా ‘పైప్‌బాట్స్‌’ పేరిట చిట్టిచిట్టి రోబోలను తయారు చేశారు. 40 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ పైప్‌బాట్స్‌ చూడడానికి బొమ్మ కారులా ఉంటాయి. ధ్వని తరంగాలను కచ్చితంగా గుర్తించేందుకు వినియోగించే అత్యాధునిక అకుస్టిక్‌ సెన్సార్లు, కెమెరాలు చిన్నచిన్నవి ఈ పైప్‌బాట్స్‌కు అమర్చబడి ఉంటాయి. పైప్‌బాట్‌లను ఏదైనా పైప్‌లైన్‌లోకి పంపిస్తే... అంతా గాలించి లీకేజీలను గుర్తించి.. పైన ఉన్న ఇంజనీర్లకు సమాచారం ఇవ్వడమే కాక... మరమ్మతు పనులు కూడా పూర్తి చేసేస్తాయి. అంతేనా.. నిర్దేశిత దూరంలో ఉన్న మరో పైప్‌బాట్‌తో సమాచారాన్ని పంచుకుని కలిసి పనిని పూర్తి చేసే సామర్థ్యం కూడా ఈ పైప్‌బాట్స్‌ సొంతం. ఈ పైప్‌బాట్స్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే డబ్బు, సమయంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల లీటర్లు నీరు ఆదా అవుతాయి. ఈ పైప్‌బాట్స్‌ను మంచినీటి పైప్‌లైన్లలోనే కాక గ్యాస్‌ పైప్‌లైన్లు, డ్రైనేజీ పైపులు, మనుషులు చేరుకోలేని ప్రమాదకర ప్రాంతాలకు కూడా పంపి పని చేయించుకోవచ్చునని యూకే ఇంజనీర్లు చెబుతున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 04:51 AM