Share News

Former SIB chief Prabhakar Rao: రాజకీయ శరణార్థిగా గుర్తించండి

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:40 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, అమెరికాలో తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పిటిషన్‌ దాఖలు చేశాడు. భారత అధికారులు తనపై అక్రమ కేసు నమోదు చేసి, వేధిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు

Former SIB chief Prabhakar Rao: రాజకీయ శరణార్థిగా గుర్తించండి

  • అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్‌ దాఖలు.. భారత అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు

  • రాజకీయ కారణాలతో తనపై కేసులు నమోదు చేశారని వెల్లడి

  • రెడ్‌ కార్నర్‌ నోటీసు తప్పించుకునే యత్నం

  • పారిపోయే ముందు ఆధారాల ధ్వంసం: సిట్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు అమెరికాలో రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలని కోరుతూ.. పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం. ‘‘నేను ఐపీఎస్‌ అధికారిగా పనిచేశాను. అందరు అధికారుల మాదిరిగానే విధులు నిర్వర్తించాను. కొత్త ప్రభుత్వం వచ్చాక.. నాపై కక్షగట్టింది’’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. భారత అధికారులు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కారణాలతో తనపై అక్రమ కేసు నమోదు చేసి, వేధిస్తున్నట్లు వివరించారని తెలుస్తోంది. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు కావడం, ఆయనపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ అవ్వడం.. అమెరికాలో వలస విధానాలను కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో.. తప్పనిసరిగా తనను భారత్‌కు తిప్పిపంపిస్తారని భావించిన ప్రభాకర్‌రావు.. ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాకర్‌రావు ఫ్లోరిడాలో తన కుమారుడి వద్ద ఉంటూ.. కాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పాస్‌పోర్టు రద్దయినప్పటికీ.. అది భారత్‌కు మాత్రమే సంబంధించిన విషయం. దాంతో ఆయన తన వద్ద ఉన్న పాస్‌పోర్టుతో ఏ దేశానికైనా వెళ్లొచ్చు. పాస్‌పోర్టులో అన్ని పేజీల్లో స్టాంపింగ్‌ పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.


అయితే.. ఇంటర్‌పోల్‌ సభ్యదేశాల విమానాశ్రయాలకు రెడ్‌కార్నర్‌ నోటీసులను పంపితే.. ప్రభాకర్‌రావుకు ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో.. అమెరికాలో రాజకీయ శరణార్థిగా గుర్తించాలనే పిటిషన్‌ వేస్తే.. కేసు తేలే వరకు తనపై ఎలాంటి చర్యలు ఉండబోవనే ఉద్దేశంతోనే ప్రభాకర్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ పిటిషన్‌పై తమకు సమాచారం లేదని సిట్‌ అధికారులు చెబుతున్నారు. కాగా.. ప్రభాకర్‌రావు బెయిల్‌ పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన సిట్‌ పోలీసులు.. ఓ కీలక విషయాన్ని కోర్టు ముందుకు తీసుకుని వెళ్లారు. ప్రభాకర్‌రావు గత ఏడాది మార్చి 10న దేశం విడిచి పారిపోయారని, అదే రోజు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదయిందని వివరించారు. ఈ కేసులో తనను ప్రశ్నిస్తారనే అనుమానాలతో ప్రభాకర్‌రావు పారిపోయారని, ఇంటి నుంచి వెళ్లే ముందు ఎలాంటి ఆధారాలు దొరకకుండా శుభ్రం చేయించినట్లు తమ విచారణలో వెల్లడైంద ని కోర్టుకు తెలిపారు.

Updated Date - Apr 11 , 2025 | 04:42 AM