Owaisi on Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై పోరాటం
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:02 AM
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వక్ఫ్ సవరణ చట్టంపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ముస్లింల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే ఈ చట్టాలు తీసుకువస్తున్నారని విమర్శించారు

అంబేద్కర్ కాలి ధూళికి కూడా మోదీ సమానం కాదు
మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, ఏప్రిల్19(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ సవరణ నల్ల చట్టాన్ని ఉపసంహరించే వరకు కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలకు చెందాల్సిన ఆస్తులను కాజేసేందుకే మోదీ రాజ్యంగ వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. హిందూ, సిక్కు వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు ఆధ్వర్యంలో దారుల్‌సలాం మైదానంలో నిర్వహించిన నిరసన సభలో ఒవైసీ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో అంబేద్కర్ మత పరమైన విధానాలు, సంప్రదాయాలను గౌరవించాలని స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయితే తానే గొప్ప మేధావినని భావిస్తూ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిన మోదీ... అంబేద్కర్ కాలి ధూళితో కూడా సమానం కాదని ఒవైసీ వ్యాఖ్యానించారు.
11 ఏళ్లుగా అణచివేత
ప్రధానిగా మోదీ పదకొండేళ్లుగా దేశంలో ముస్లింలను అణిచివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టంతో పాటు ఇతర నల్ల చట్టాల వల్ల దేశం బలహీనంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. త్రిపుల్ తలాఖ్, సీఏఏ నల్లచట్టాలను తీసుకువచ్చి ముస్లింలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. దావూద్ బోహ్రా వర్గం గతంలోనే వక్ఫ్ బిల్లు నుంచి తమను మినహాయించాలని కోరినట్టు తెలిపారు. అయితే వక్ఫ్ సవరణ చట్టంపై దావూద్ బోహ్రా వర్గం సంతృప్తిగా ఉన్నట్టు మోదీ ఫొటోలకు ఫోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. వక్ఫ్ సవరణ చట్టం తర్వాత యూనిఫాం సివిల్‌కోడ్ తీసుకురావడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోర్టులపై తమకు విశ్వాసం ఉందని, తప్పకుండా గెలుస్తామని అన్నారు.
కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే
ముస్లింల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే ఇలాంటి నల్లచట్టాలను తీసుకువస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుతో మసీదులు, ఆస్తులను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 500కు పైగా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ పరం చేశారని చెప్పారు. నల్లచట్టాలను ఉపసంహరించేవరకు ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ అధ్యక్షతన జరిగిన సభలో డీఎంకే ఎంపీ మహ్మద్ అబ్దుల్లా, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ హఫీజ్‌ఖాన్, బీఆర్‌ఎస్ నేత మహమూద్ అలీ, నాయకులు పాల్గొన్నారు.