Share News

Osmania University: ఓయూ తప్పిదం.. అభ్యర్థులకు శాపం!

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:19 AM

ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారుల తప్పిదం ఆ ఉద్యోగార్థుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివి, మంచి ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ వారికి ఉద్యోగం దక్కకుండా పోయింది.

Osmania University: ఓయూ తప్పిదం.. అభ్యర్థులకు శాపం!

ఉత్తీర్ణత తేదీని తప్పుగా ఇవ్వడంతో హాస్టల్‌ వెల్ఫేర్‌ పోస్టుల్లో అన్యాయం

  • ఆందోళనలో 10 మంది ర్యాంకర్లు

  • సాంకేతిక తప్పిదం అంటూ వర్సిటీ లేఖ పంపినా పట్టించుకోని టీజీపీఎస్సీ

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారుల తప్పిదం ఆ ఉద్యోగార్థుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివి, మంచి ర్యాంకులు తెచ్చుకున్నప్పటికీ వారికి ఉద్యోగం దక్కకుండా పోయింది. గత ప్రభుత్వంలో 2022 డిసెంబరు 23న గిరిజన, ఎస్సీ, బీసీ, సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాంగుల, స్ర్తీశిశు సంక్షేమ శాఖలకు సంబంధించి హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(హెచ్‌డబ్ల్యూవో) పోస్టుల కోసం టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2023లో పలు దఫాలుగా పరీక్ష కూడా నిర్వహించింది. నోటిఫికేషన్‌ విడుదలయ్యే సమయానికి అభ్యర్థి కచ్చితంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ పూర్తిచేసి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే నోటిఫికేషన్‌ విడుదలయ్యే తేదీకి రెండు రోజుల ముందే ఓయూ పరిధిలోని విద్యార్థులు పాస్‌ అయినట్లు మెమోలు వచ్చాయి. వాటితోనే పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రాస్తే, వారిలో కొందరికి మంచి ర్యాంకులొచ్చాయి. వీరంతా ఆయా జోన్లు, రిజర్వేషన్‌ కేటగిరి ఆధారంగా మెరిట్‌ లిస్టులో కూడా ఉన్నారు. ఆ తర్వాత టీజీపీఎస్సీ 1:1 నిష్ఫత్తిలో పిలిచి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ చేసింది. ఆ వివరాలతో క్రాస్‌ వెరిఫికేషన్‌ కోసం ఓయూకు పంపితే వారేమో సదరు అభ్యర్థులు, బీఈడీ పాస్‌ అయిన తేదీని 21 డిసెంబరు 2022కి బదులు, 30 డిసెంబరు 2022గా పేర్కొన్నారు.


దీంతో నోటిఫికేషన్‌ విడుదలయ్యే 23 డిసెంబరు2022 నాటికి బీఈడీ పూర్తి కాలేదనే కారణంతో టీజీపీఎస్సీ అధికారులు 17 మార్చి 2025న విడుదల చేసిన ప్రొవిజనల్‌ జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. ర్యాంకు వచ్చినా ప్రొవిజనల్‌ జాబితాలో పేర్లు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కాగా ర్యాంకు వచ్చి, మెరిట్‌ లిస్టులో పేర్లు ఉండి ప్రొవిజనల్‌ జాబితాలో పేరు రాకపోవడానికి పాస్‌ అయిన తేదీని తప్పుగా ఇవ్వడమే కారణమని తెలుసుకున్న అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారులను సంప్రదించారు. అక్కడి అధికారులు సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని గత నెల 20వ తేదీన టీజీపీఎస్సీకి లెటర్‌ పంపించారు. అభ్యర్థులు వెళ్లి టీజీపీఎస్సీలో అడిగినప్పుడు కూడా అధికారులు వర్సిటీ నుంచి లెటర్‌ అందిందని చెప్పారు. కానీ, ఆ తప్పును సరిదిద్దేందుకు ససేమిరా అంటున్నారు. దాదాపు పది మంది అభ్యర్థులు ఈ తప్పిదం వల్ల ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీంతో అభ్యర్థులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం స్పందించి ర్యాంకులు తెచ్చుకున్న తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.


న్యాయం జరిగేదాకా పోరాటం

30.jpg

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం జరిగిన పరీక్షలో నాకు 135వ ర్యాంకు వచ్చింది. జోనల్‌, రిజర్వేషన్‌ కేటగిరి ప్రకారం నాకు ఉద్యోగం కచ్చితంగా రావాలి. అయితే ప్రొవిజనల్‌ జాబితాలో మాత్రం నా పేరు లేదు. పాస్‌ అయిన తేదీని యూనివర్సిటీ తప్పుగా చెప్పిందని తెలుసుకొని వారిని సంప్రదిస్తే సాంకేతిక తప్పిదం కారణంగా పొరపాటు జరిగిందని చెప్పారు. వర్సిటీ నుంచి టీజీపీఎస్సీకి మళ్లీ లేఖ రాశారు. వారి ఆఫీసుకు వెళ్లి లేఖ వచ్చిందా అని అడిగితే వచ్చింది అన్నారు. కానీ తప్పను సరిదిద్ది మాకు ఉద్యోగాలు కల్పించడం లేదు. ప్రస్తుతం కోర్టులో పిటిషన్‌ వేశాం.

- భాస్కర్‌, అభ్యర్థి, వనపర్తి జిల్లా

Updated Date - Apr 09 , 2025 | 05:19 AM